కరోనాపై సర్కార్ కాడేత్తేసింది..17 రోజులుగా మీటింగుల్లేవ్​ సమీక్షల్లేవ్​

కరోనాపై సర్కార్ కాడేత్తేసింది..17 రోజులుగా మీటింగుల్లేవ్​ సమీక్షల్లేవ్​
  • పదుల కేసులున్నప్పుడు సీఎం వరుస రివ్యూలు
  • ఇప్పుడు వేల కేసులు వస్తుంటే పట్టింపులేదు
  • ఫోకసంతా సెక్రటేరియట్ కూల్చివేతపైనే
  • ఇరిగేషన్​, షరతుల సాగుపైనే రివ్యూలు
  • టెస్టులు, ట్రీట్​మెంట్​ కోసం జనం తిప్పలు
  • జిల్లాల్లోనూ పెరుగుతున్న కేసులు

కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు వరుస రివ్యూలు, ప్రెస్​మీట్లతో హడావుడి చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కరోనా మాటెత్తటం లేదు. 17 రోజులుగా ప్రజారోగ్యంపై ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మరోవైపు రాష్ట్రంలో రోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. హైదరాబాద్​లో పరిస్థితి అదుపుతప్పింది. అయినా అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రభుత్వం ఇష్టపడటం లేదు. తాము ప్రాధాన్యమిచ్చే అంశాల్లో కరోనా లేనే లేదన్నట్లుగా.. సీఎం కేసీఆర్ ఇతర అంశాలపై ఫోకస్  పెట్టారు. ప్రజలు మాత్రం కరోనా టెస్టులు, ట్రీట్​మెంట్​ కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.

హైదరాబాద్, వెలుగు:పద్నాలుగు రోజులపాటు ఫాంహౌస్​లో గడిపిన సీఎం కేసీఆర్ ఈ నెల 11న ప్రగతిభవన్ కు రాగానే.. కరోనాపై రివ్యూ ఉంటుందని ఆఫీసర్లు భావించారు. అయినా.. ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. కరోనాపై సీఎం రివ్యూ చేసి పక్షం రోజులు దాటిపోయింది. గత నెల 28న పీవీ శత జయంతి వేడుకలకు హాజరైన కేసీఆర్ అదేరోజు సాయంత్రం కరోనా తీవ్రతపై రివ్యూ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి పెరిగిపోయిందని, మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచన ఉందని ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల్లో కేబినెట్​ మీటింగ్ పెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామని లీకులిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేబినెట్  భేటీ జరగలేదు కదా.. కరోనాపై ఎలాంటి రివ్యూ కూడా లేదు. హెల్త్ డిపార్ట్ మెంట్ రోజువారీగా సీఎం ఆఫీస్​కు కరోనాపై పంపే రిపోర్టులను కూడా చూడటం లేదనే అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్య సీఎం ఇతర అంశాలపై జరిపిన సమీక్ష సమావేశంలో కొందరు లీడర్లు కరోనా విషయం ప్రస్తావించగా..  ఇప్పుడు ఎందుకు దాని గురించి చర్చ అని బదులిచ్చినట్లు తెలిసింది.

కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో వస్తున్నా సీఎం కేసీఆర్  మాత్రం సెక్రటేరియట్  కూల్చివేతపైనే  ఫోకస్​ పెట్టారు. సెక్రటేరియట్  కూల్చివేతపై హైకోర్టు స్టే సోమవారంతో తొలిగిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ బుధవారం వరకు స్టే పొడిగించింది. దీంతో కోర్టులో వాదనలు ఎలా వినిపించాలనే దానిపై గత రెండురోజులుగా పొద్దుపోయే వరకు లీగల్​ ఎక్స్​పర్ట్స్​తో  సీఎం సమావేశం జరిపినట్టు తెలిసింది. కూల్చివేతకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కోర్టుకు రిపోర్ట్​ చేయాల్సిన అంశాలపై చర్చ జరిపినట్లు సమాచారం. గత నెల 28 నుంచి ఈనెల 11 వరకు సీఎం హైదరాబాద్​కు దూరంగా ఎర్రవల్లి ఫామ్​హౌస్​లోనే ఉన్నారు. 11న  సాయంత్రం ఫాంహౌస్​ నుంచి తిరిగొచ్చిన తర్వాత సీఎం .. ఇప్పటివరకు కరోనా తప్ప మిగతా అంశాలపైనే సమీక్ష జరిపారు. ఫాంహౌస్​ నుంచి వచ్చినరోజు హడావుడిగా అగ్రికల్చర్, ఆదివారం ఇరిగేషన్ అంశాలపై రివ్యూ చేశారు. వచ్చీ రాగానే కరోనా కేసులు, మరణాలు, హైదరాబాద్​ లో లాక్​డౌన్​ అంశాలపై సీఎం సమీక్షిస్తారని, కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటారని భావించిన హెల్త్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు.. పరిస్థితిని చూసి కంగుతిన్నారు.

ఈటల మౌనం

హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గత నెల 29 నుంచి ప్రెస్​మీట్లకు దూరంగా ఉంటున్నారు. గత నెలలో వరుసగా హాస్పిటళ్లలో పర్యటించటంతోపాటు డాక్టర్లు, ఆఫీసర్లతో రివ్యూలు, రెండు రోజులకోసారి ప్రెస్​మీట్లు పెట్టిన ఆయన ఇప్పుడు సైలెంటయ్యారు. అసమగ్రంగా ఇచ్చే హెల్త్ బులెటిన్లు, తప్పుడు లెక్కలు, కేసులు, మరణాలు దాచిపెట్టడం, వరుసగా హైకోర్టు మందలించడం వైద్యారోగ్య శాఖ పనితీరును బట్టబయలు చేసింది. కరోనా పేషెంట్లు కొందరు  హాస్పిటళ్లలో తమ దుస్థితిని  సెల్ఫీ వీడియోలు, ఆడియో ల ద్వారా విడుదల చేయడం ప్రభుత్వం పనితీరును వేలెత్తి చూపింది. తర్వాత  నుంచి కేసులు పెరిగిపోయాయి. అప్పటి నుంచీ ఆఫీసర్లు మాత్రమే ప్రెస్​మీట్లు పెట్టి.. కరోనా మొత్తం కంట్రోల్​లో ఉందన్నట్లుగా ప్రకటిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు  ప్రజారోగ్యం పట్టనట్లుగా మంత్రులు వివిధ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. అదే  టైంలో కరోనా అంశంపై రివ్యూలు జరపకుండా సెక్రటేరియట్​ కూల్చివేత, షరతుల సాగు, ఇరిగేషన్​పై సీఎం ఫోకస్ పెట్టిన తీరును చూస్తే.. కరోనా కథ కంచికి.. ప్రజారోగ్యం గాలికి.. అన్నట్లుగా తయారైందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టెస్టులు, ట్రీట్మెంట్.. అన్నింటా నిర్లక్ష్యం

ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో కరోనా నియంత్రణ చర్యలన్నీ గాడి తప్పాయి. టెస్టుల కోసం బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తున్నది. సర్కారు  ట్రీట్​మెంట్​పై నమ్మకం లేక 90 శాతంపైగా సర్కారు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లు మాత్రం పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. లాక్​ డౌన్ అంటూ ప్రభుత్వం లీక్​లు ఇవ్వడంతో హైదరాబాద్ నుంచి దాదాపు 20 శాతం మంది సొంతూళ్లకు పోయారు. దీంతో జిల్లాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నారని మొదట్లో వైద్య సిబ్బందిని ప్రశంసించిన ప్రభుత్వం.. తర్వాత వాళ్లను పట్టించుకోవడం లేదు. డ్యూటీలు పర్మనెంట్​ చేయాలని, తమ జీతాలను పెంచాలని గాంధీ హాస్పిటల్​లోని వైద్య సిబ్బంది ఆందోళనకు దిగినా ఫలితం లేకుండాపోతోంది. కరోనాపై సీఎం స్థాయిలో రివ్యూలు జరగకపోవడంతో కింది స్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. కనీసం కరోనా పేషెంట్ల మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు సరైన విధానం లేకపోవటం వివాదాస్పదమైంది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఒకేరోజు నలుగురు చనిపోవటం, శవం తరలింపునకు అంబులెన్స్ లేక బంధువులే ఆటోలో తరలించడం.. పెద్దపల్లిలో ఓ మృతదేహాన్ని తరలించేందుకు డాక్టరే ట్రాక్టర్​ నడపడం.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వేలెత్తిచూపుతున్నాయి.

గుప్త నిధుల కోసమే సెక్రటేరియట్ కూల్చివేత