దవాఖానల్లో మందులకు పైసలు అయిపోయినయ్​

దవాఖానల్లో మందులకు పైసలు అయిపోయినయ్​
  • ఫీవర్ల దెబ్బకు మూడు నెలల్లోనే రూ. 40 కోట్ల మెడిసిన్​ వాడకం
  • పంపిణీకి సిద్ధంగా మరో రూ.10 కోట్ల విలువైన మెడిసిన్‌‌‌‌
  • 200 దవాఖాన్లలో స్పెషల్ బడ్జెట్ ఖల్లాస్
  •  అదనంగా పైసలు ఇస్తే తప్ప నడపలేమంటున్న డాక్టర్లు
  • బడ్జెట్‌‌‌‌ కోరుతూ ప్రభుత్వానికి టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ప్రతిపాదనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

జనాల జేబులకు.. ప్రభుత్వ ఖజానాకు దోమలు గండి కొట్టినయ్‌‌‌‌. వైరల్ ఫీవర్లు, డెంగీ బాధితుల దెబ్బకు దవాఖాన్లకు కేటాయించిన మెడిసిన్ బడ్జెట్‌‌‌‌ మొత్తం ఖాళీ అయింది. దీంతో అదనపు బడ్జెట్ కోరుతూ హెల్త్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కేవలం ఈ 3 నెలల్లో ఫీవర్ బాధితులకే రూ.40 కోట్ల మెడిసిన్ పంపిణీ చేసినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. జులై–అక్టోబర్‌‌‌‌ మధ్య ఫీవర్ బాధితులు సర్కారు దవాఖాన్లకు పోటెత్తారు. బెడ్లు సరిపోక నెలపైనే పడుకోబెట్టి ఎంతోమంది పేషెంట్లకు డాక్టర్లు ట్రీట్‌‌‌‌మెంట్ చేశారు. పేషెంట్ల సంఖ్య రెట్టింపు అవడంతో, మందులు కూడా అదే స్థాయిలో పంపిణీ చేయాల్సి వచ్చింది. యాంటీపైరేటిక్స్‌‌‌‌, యాంటీ బయోటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్​ను కోట్ల సంఖ్యలో కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.40 కోట్లు వెచ్చించారు. ఇప్పటికీ జ్వరాలు కొనసాగుతుండటంతో మరో రూ.10 కోట్ల విలువైన స్టాక్ సెంట్రల్ డ్రగ్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌లో పంపిణీకి సిద్ధంగా పెట్టుకున్నారు. సాధారణంగా ఇదే సీజన్‌‌‌‌లో ఇందులో మూడో వంతు మాత్రమే ఖర్చయ్యేదని సెంట్రల్ డ్రగ్‌‌‌‌ ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఒకరు చెప్పారు.

200 దవాఖాన్లలో ఒడిసిన బడ్జెట్

మెడిసిన్ కొనుగోలు బడ్జెట్‌‌‌‌కు గతేడాది నుంచి ప్రభుత్వం కోతలు పెడుతూ వస్తోంది. పోయినేడాది రూ.332 కేటాయిస్తే, ఈ ఏడాది రూ.226 కోట్లు మాత్రమే ఇచ్చింది. అన్ని దవాఖాన్లకు టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని కేసుల్లో మాత్రమే అవసరమయ్యే మెడిసిన్‌‌‌‌ను హాస్పిటల్ సూపరింటెండెంట్లే కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీకి ఇచ్చిన బడ్జెట్‌‌‌‌లో 20% హాస్పిటళ్లకు కేటాయిస్తారు. ఫీవర్ బాధితులు పోటెత్తిన నేపథ్యంలో స్పెషల్ బడ్జెట్‌‌‌‌ను సైతం ఫీవర్ మెడిసిన్‌‌‌‌కు వినియోగించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకముందే దవాఖానకు ఎంతొస్తుందో లెక్కేసుకుని, కంపెనీల వద్ద బకాయిలు పెట్టి మెడిసీన్ కొన్నారు. దీంతో ఆర్థిక సంవత్సరం ముగియకముందే 200 దవాఖాన్లకు కేటాయించిన స్పెషల్ బడ్జెట్‌‌‌‌ ఖర్చయిపోయింది. మరో 3 నెలలకు అదనపు బడ్జెట్‌‌‌‌ కేటాయిస్తే తప్ప హాస్పిటళ్లు నడపలేమని సూపరింటెండెంట్లు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది.

గతేడాదివే ఇంకా ఇయ్యలే

గతేడాది కేటాయించిన రూ.332 కోట్లలో ప్రభుత్వం రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఆ ఏడాది మెడిసిన్ సప్లై చేసిన కంపెనీలకే ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. కంపెనీల ప్రతినిధులు, యజమానులు టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది కేటాయించిన దాంట్లో ఇప్పటివరకూ రూ.72 కోట్లు మాత్రమే విడుదల చేశారు. కంపెనీల ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

The Telangana government has allocated a special budget for 200 hospitals is spent