ప్రైవేట్ టీచర్లకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం

V6 Velugu Posted on Apr 08, 2021

కరోనా కారణంగా.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేటు టీచర్లకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది సర్కార్. గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు, ఇతర సిబ్బందికి  2వేల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి  25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రైవేటు  విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, ఇతర వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు సీఎం. దీనిపై విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు సీఎం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు లక్షా 45 వేల మంది టీచర్లు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

కరోనా టైంలో నానా కష్టాలు పడ్డారు ప్రైవేట్ టీచర్లు. స్కూళ్లు బంద్ ఉండి జీతాలు రాక రోడ్డున పడ్డారు ప్రైవేటు టీచర్లు. కొందరు ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది మంది టీచర్లు.. కూలీనాలీ చేసుకుంటూ కుటుంబం గడుపుతున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు నెల రోజుల ముందు స్కూల్స్ ఓపెన్ చేసి.. ఎన్నికలయ్యాక.. కరోనా పెరుగుతోందని ప్రభుత్వం స్కూళ్ల మూసివేసింది. సర్కార్ నిర్ణయంపై ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. వైన్సులు, బార్లకు లేని బంద్.. స్కూళ్లకే ఎందుకని సర్కార్ ను ప్రశ్నించారు.

 

Tagged KCR, Telangana government, private teachers

More News