ఇక సింగరేణిపై తెలంగాణ సర్కార్​ ఫోకస్​

ఇక సింగరేణిపై తెలంగాణ సర్కార్​ ఫోకస్​
  • ఇక సింగరేణిపై సర్కార్​ ఫోకస్​
  • విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలే రూ. 29 వేల కోట్లా?
  • ఇంతలా పేరుకుపోవడానికి కారణాలేంటని ఆరా
  • త్వరలోనే సింగరేణిపై రివ్యూ.. టెన్షన్‌‌లో ఉన్నతాధికారులు
  • సీఎండీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఎన్.శ్రీధర్

మంచిర్యాల, వెలుగు : రాష్ట్ర విద్యుత్​ సంస్థలు సింగరేణికి రూ.29 వేల కోట్లకు పైగా బాకీ పడడంపై రాష్ట్ర సర్కారు సీరియస్‌‌గా ఫోకస్‌‌ పెట్టింది. బకాయిలు ఇంతలా పేరుకుపోవడానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే సింగరేణిపై రివ్యూ నిర్వహించే చాన్స్ ఉందని తెలుస్తున్నది. దీంతో ఆ సంస్థ ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్​రావు బాటలోనే తన పదవికి సింగరేణి సీఎండీ శ్రీధర్ రిజైన్ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయితే అంతకుముందే సింగరేణి ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్‌‌ ఇవ్వాలని ఆయన్ను రాష్ట్ర సర్కారు ఆదేశించనుందని, ఆ తర్వాతే పదవి నుంచి పక్కనపెట్టే చాన్స్ ఉందని సమాచారం.

గత పదేండ్లలో బీఆర్ఎస్ సర్కారు అనుసరించిన విధానాల వల్ల సింగరేణి దివాలా తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలు బకాయిలు పడ్డ వేల కోట్లను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలున్నాయి. దీంతో ట్రాన్స్​కో, జెన్​కో సంస్థల బాకీలు పెరిగిపోయాయి. కోల్ బకాయిలు రూ.14 వేల కోట్లు, కరెంటు బకాయిలు రూ.15 వేల కోట్లు కలిపి మొత్తం రూ.29 వేల కోట్లకు పైగా సింగరేణికి బాకీ పడ్డాయి. ట్రాన్స్​కో చెల్లించాల్సిన రూ.350 కోట్ల వడ్డీని సర్కారు మాఫీ చేసింది. మరోవైపు సింగరేణి సంస్థను అప్పటి ప్రభుత్వం బంగారుబాతులా వాడుకుంది.

డిస్ర్టిక్ట్​ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్​(డీఎంఎఫ్టీ), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) పేరిట వందల కోట్ల ఫండ్స్​ను పక్కదారి పట్టించింది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం డీఎంఎఫ్​టీ ద్వారా ఏటా రూ.500 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.3 వేల కోట్లకు పైగా వాడుకుంది. సీఎస్సార్ కింద ఏటా రూ.250 కోట్లను ఖర్చు పెట్టించింది. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టాల్సిన ఈ ఫండ్స్​ను కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు నియోజకవర్గాలైన గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కోల్​బెల్ట్ పరిధిలోని 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రెండేళ్లుగా రూ.2 కోట్ల చొప్పున శాంక్షన్ చేసింది. రామగుండంలో మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు కేటాయించింది.

విద్యుత్​ సంస్థల నుంచి బకాయిలు రాకపోవడం, ఫండ్స్​ను ఇష్టారీతిన దారిమళ్లించడం వల్ల సింగరేణి కార్మికులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడే నాటికి సింగరేణికి రూ.3,450 కోట్ల బాండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌లు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. కార్మికులకు, ఉద్యోగులకు నెలకు రూ.250 కోట్ల జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతోంది. దీంతో బాండ్లు కుదువపెట్టడంతో పాటు బ్యాంకుల దగ్గర సంస్థ అప్పులు చేస్తున్నది.

2015 నుంచి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే సీఎండీ.. ఎన్నో ఆరోపణలు

సింగరేణి సీఎండీగా నడిమెట్ల శ్రీధర్ 2015 జనవరి 1న నియమితులయ్యారు. 2016 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆయన రెండేండ్ల పదవీకాలం పూర్తయింది. కానీ 2017 నుంచి ఏటా శ్రీధర్ పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. తొమ్మిది ఏండ్లుగా సీఎండీగా కొనసాగుతున్న శ్రీధర్.. తన పదవీకాలంలో అనేక అపవాదులను మూటగట్టుకున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు తలూపుతూ సింగరేణిని దివాలా తీయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ బకాయిల వసూలుకు సీరియస్​గా ప్రయత్నించలేదని, సింగరేణి ఫండ్స్​ను ఇష్టారాజ్యంగా దారి మళ్లించారని విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ప్రతి నెల అప్పులు తెస్తే తప్ప కార్మికులకు, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి సింగరేణి చేరుకుందని, శ్రీధర్ తీరే ఇందుకు కారణమని కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పలు కుంభకోణాల్లోనూ సీఎండీ పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈలోగానే ఆయన రిజైన్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం మాత్రం సింగరేణి ఆర్థిక పరిస్థితిపై వైట్​ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన నుంచి తీసుకున్న తర్వాత పదవి నుంచి పక్కనపెట్టే చాన్స్ ఉందని సమాచారం.

సీఎండీ శ్రీధర్ అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి: బీఎంఎస్ నేత కె.లక్ష్మారెడ్డి

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణి సీఎండీ అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ సర్కారు ఎంక్వైరీ చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్​(బీఎంఎస్) నేషనల్ లీడర్ కె.లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కోల్​మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్​) విస్తృత స్థాయి గుర్తింపు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్యతో కలిసి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ‘‘మినీ మహారత్నగా పేరుగాంచిన సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ సర్కార్ అనుబంధ టీబీజీకేఎస్ యూనియన్ దివాలా సంస్థగా మార్చింది. 

సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ నిబంధనలకు విరుద్ధంగా పదేండ్లుగా కొనసాగుతున్నా.. ఏ యూనియన్ అడ్డుచెప్పలేదు. ఆయన హయాంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. వేల కోట్ల సింగరేణి ఫండ్స్​ను అక్రమంగా మళ్లించారు. అడ్డగోలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన, అవకతవకలకు సహకరించిన సీఎండీ ఎన్​.శ్రీధర్​పై విచారణ చేయించాలి” అని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ కాగడా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.