
రెండేండ్లుగా జీవోకే పరిమితమైన 38 బిల్డింగ్స్
క్రిస్టియన్, కేరళ, బంజారా భవనాల పరిస్థితీ అంతే
సర్కారు ఫోకస్ అంతా సెక్రటేరియట్ పైనే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘బీసీ ఆత్మ గౌరవ భవనాలు’ రెండేండ్లుగా ఫైళ్లలోనే మగ్గుతున్నాయి. 2018 సెప్టెంబర్లో అసెంబ్లీ రద్దుకు ముందు బీసీ కులాలకు హైదరాబాద్ లో బిల్డింగ్స్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అ వసరమైన స్థలంతో పాటు నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. వివిధ పనుల కోసం రాజధానికి వచ్చే బీసీలకు సౌలతుగా ఉండేలా ఈ బిల్డింగ్స్ నిర్మించాలని ఆఫీసర్లను ఆదేశించారు. అట్లకులాల వారీగా సుమారు 38 కులాలకు ఆత్మగౌరవ భవనాలు సీఎం ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ లోని బీసీ నేతలు కూడా రెండోసారి అధికారంలోకి రాగానే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తారని సంబురపడ్డారు. కానీ నిర్ణయం తీసుకొని రెండేండ్లవుతున్నా వాటికి ముగ్గుపోయలేదు.. పునాది తీయలేదు. ఎప్పుడు నిర్మిస్తారో కూడా తెలియని పరిస్థితి.
సెక్రటేరియట్ పైనే రివ్యూలు
కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ఫోకస్ పెడుతున్న సీఎం కేసీఆర్.. ఆత్మ గౌరవ భవనాలపై ఎందుకు దృష్టి పెట్టడంలేదని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. హామీలను కాగితాలకు పరిమితం చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ గురించే చర్చిస్తున్నారు. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభించారు. కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ డిజైన్ పై సీఎం రివ్యూలు పెట్టారు. డిజైన్ కు ఆమోదం తెలిపి, నిర్మాణం కోసం నిధులను కేటాయించారు. కానీ.. రెండేండ్ల కింద ఇచ్చిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాల’ హామీ బుట్టదాఖలు చేశారని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.
కేటాయింపులకే పరిమితం
బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కేటాయించిన భూమి, నిధులు ఇంతవరకు బీసీ సంక్షేమ శాఖకు అందలేదని తెలిసింది. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 104 ఎకరాలు, బిల్డింగ్స్ నిర్మాణం కోసం రూ. 58.75 కోట్లు కేటాయించారు. ఇందుకోసం 2018 ఆగస్టు 29న జీవో 189ను జారీ చేశారు. రంగారెడ్డిజిల్లా కోకాపేటలో 55 ఎకరాలు, మేడ్చల్ జిల్లా ఉప్పల్ పరిధిలో 49 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఈ భూమిని రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ బదిలీ అంశం ఇంకా ప్రాసెస్ దశలోనే ఉంది. నిధులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కు అందలేదని సమాచారం. దీనిపై బీసీ సంక్షేమ శాఖ సర్కారుకు లెటర్లు రాసినా స్పందన లేదని తెలిసింది.
క్రిస్టియన్, కేరళ, బంజారా భవనాల పరిస్థితి అంతే
క్రిస్టియన్, కేరళ, బంజారా బిల్డింగ్స్ హామీ కూడా మూలకు పడింది. క్రిస్టియన్ భవన్ కోసం యాప్రాల్ లో 2 ఎకరాల స్థలం కేటాయించారు. మంచి డిజైన్ తో అంతర్జాతీయ స్థాయిలో 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ. 25 కోట్లు కేటాయించారు. ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణంపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఫిల్మ్ నగర్ లో కేరళ భవన్ కోసం ఎకరం స్థలం, కోటి రూపాయాలు కేటాయించారు. 2015 సెప్టెంబర్ 20న శంకుస్థాపన కూడా చేశారు. బంజారాహిల్స్
లో బంజారా, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా బంజార భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని.. 2014 డిసెంబర్11న శంకుస్థాపన చేసింది. కానీ ఏ బిల్డింగ్ కు కూడా ఇప్పటివరకు పునాదులు పడలేదు.