సూక్ష్మ రాతియుగం నాటి చిత్రాలు గుర్తింపు

సూక్ష్మ రాతియుగం నాటి చిత్రాలు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం కాశీపేటలో ఆదిమానవుల నాటి కొత్త రాతి బొమ్మల తావు(పెయింటెడ్ రాక్ షెల్టర్​) వెలుగు చూసింది. కీసరగుట్టకు సమీపంలో ఉన్న చిన్నరాతి గుట్టపై రాక్​ ఆర్ట్స్​ను తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. 30 అడుగుల ఎత్తున్న రాతిగుట్ట మీది పడిగెరాయిపై..  లోపలి వైపు వేసిన ఎరుపు రంగు రాతి చిత్రాలు ఉన్నాయి. అక్కడ వేంకటేశ్వరుని గుడి ఉందని.. అందువల్ల స్థానికులు వేసిన జాజు, సున్నం వంటి అలంకరణలతో చాలా రాతి చిత్రాలు మరుగునపడిపోయినట్లు గుర్తించింది.  ప్రస్తుతం కనిపిస్తున్న ఆర్ట్​లో 4 అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరో చోట గుర్రాన్ని పోలిన జంతువొకటి కనిపిస్తోంది. ఇలాంటివి గతంలో హస్తలాపూర్, అక్షరాలలొద్ది వంటి తావుల్లో కనిపించాయని బృందం కన్వీనర్​ శ్రీరామోజు హరగోపాల్​ వెల్లడించారు. గుట్ట అంచుల్లో సూక్ష్మరాతి పరికరాలు లభించాయి. సమీపంలో చెదరని కైరన్ సిస్తు సమాధులు, ఒక మెన్హర్ ఉన్నాయి. ఈ రాతి చిత్రాల తావును మహమ్మద్ నజీర్, కొరివి గోపాల్ మొదట కనుగొన్నారు. ఇక్కడ లభించిన సూక్ష్మరాతి పనిముట్లు, రాతి చిత్రాల శైలి, చిత్రాల్లోని వస్తువుల ఆధారంగా సూక్ష్మ రాతియుగానికి చెందిననిగా హరగోపాల్​ అభిప్రాయ పడ్డారు.  తావును గుర్తించడంలో తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్, అహోబిలం కరుణాకర్, మండల స్వామి, భాస్కర్, భూ యజమాని శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు