ఎనిమిదేండ్లల్ల ఏం సాధించినం?

ఎనిమిదేండ్లల్ల ఏం సాధించినం?

ఇయ్యాల్టి రోజున మన దశాబ్దాల కల నెరవేరింది. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఎన్నో కలలతో, ఎంతో సాధించాలని ప్రయాణం మొదలుపెట్టినం. మరి ఈ ఎనిమిదేండ్లల్ల ఏం సాధించినం? ఈ ముచ్చట్నే రాజకీయ నాయకులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతలను ‘వెలుగు’ అడిగింది. వారి అభిప్రాయాలు 

  •     ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నయ్​: మంత్రి హరీశ్​రావు
  •     పాలకుల సంపదే పెరిగింది: దాసోజు శ్రవణ్‌‌, కాంగ్రెస్​ నేత
  •     ఇంకా దగా పడుతున్నది:  గాదె ఇన్నయ్య, ఉద్యమ నాయకుడు
  •     ఒక్కో సమస్య పరిష్కారం అవుతున్నది: దేవీప్రసాద్​, టీఎన్​జీవో మాజీ అధ్యక్షుడు
  •     రైతులకు బేడీలు వేసేందుకా రాష్ట్రం తెచ్చుకున్నది?:  చెరుకు సుధాకర్ 
  •     ఉద్యమ లక్ష్యాలు నెరవేరలే: పాశం యాదగిరి, సీనియర్​ జర్నలిస్ట్​
  •     మళ్లీ ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది: ఏపూరి సోమన్న , వైఎస్సార్​టీపీ నేత
  •     తెలంగాణ వద్దన్నోళ్లు మంత్రులైన్రు: కె.స్వామి గౌడ్‌‌, బీజేపీ నేత
  •     ఒక్క కుటుంబం కోసం ఉద్యమం జరగలే: కయ్యాడ శ్రీనివాస్‌‌ గౌడ్, కానిస్టేబుల్‌‌ 
  •     ఉద్యమకారులను గుర్తించాలె :  రహీమున్నీసా బేగం, తెలంగాణ యాక్టివిస్టు
  •     ఉద్యమకారుల కోసం కార్పొరేషన్ పెట్టాలె: సాదు రాజేశ్, కేయూ విద్యార్థి నేత


ఇంకా దగా పడుతున్నది

తెలంగాణ ఉద్యమం దేశంలోని మిగతా జాతుల పోరాటాలకు, నూతన రాష్ట్రాల ఉద్యమాలకు దారి చూపింది. ఉద్యమంలో వందలాది మంది త్యాగాలు ఉన్నయి. నీళ్లు, నిధులు, అడవులు, ఖనిజాలతోపాటు సకల సంపదలు ఈ ప్రాంత జనాలకే దక్కాలని అందరూ ఉద్యమించారు. ఏ ఒక్క పార్టీ వల్లనో, ఏ ఒక్క కులం వల్లనో ఇది సాగలేదు. విద్య, వైద్యం, ఉపాధి ప్రతి తెలంగాణ పౌరుడికి అందాలని అంతా ఆకాంక్షించారు. 1953 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం అమరులైన 2 వేల మంది ఆశయాలు నెరవేరుతాయని భావించారు. దగా పడ్డ తెలంగాణ విముక్తి పొందిందని అనుకున్నారు. ప్రతి ఇంట్లో పండుగ చేసుకున్నారు. కానీ ఈ ఎనిమిదేండ్ల పాలనలో దగా పడతున్న తెలంగాణగా, నమ్మక ద్రోహానికి గురైన తెలంగాణగా, మోసపోయిన తెలంగాణగా రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి రావడం దురదృష్టకరం. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన ఉండాలని అందరూ డిమాండ్‌‌ చేస్తున్నారు. కాళోజీ చెప్పినట్లుగా.. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరల దాకా తరిమికొట్టాం. ఇప్పుడు ప్రాంతం వాడే దోపిడీ చేస్తున్నాడు. పాతరేయాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఎవరి కోసం? ఎందుకోసం ? అని ఎవరికి వాళ్లం ప్రశ్నించుకుంటూ ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలి. నిజాం పాలనను వదిలించుకున్నట్లే కేసీఆర్‌‌ పాలనను వదిలించుకోవాలి.
- గాదె ఇన్నయ్య, టీఆర్‌‌ఎస్‌‌ వ్యవస్థాపక సభ్యుడు

ఉద్యమకారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ ఉద్యమంలో వర్సిటీల పాత్ర అద్వితీయమైనది. ఉద్యమ నిర్మాణంలో వర్సిటీలే పునాదిరాళ్లుగా నిలబడి ప్రభుత్వాలతో కలబడ్డాయి. మొక్కవోని ధైర్య సాహసాలతో, అకుంఠిత దీక్షతో ఒక విద్యార్థి తరం ముందుకు సాగింది. లాఠీ దెబ్బలు, తుపాకుల మోతలు, కేసులు, నిత్య నిర్బంధాలు, నెలల తరబడి జైలు జీవితాన్ని ఎదుర్కొన్నది. రాజకీయ పార్టీలు ఉద్యమ కార్యాచరణలో విఫలమైన అనేక సందర్భాల్లో విద్యార్థి జేఏసీలే ఉద్యమ బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. కానీ నాటి విద్యార్థుల్లో చాలా మంది అనారోగ్యం పాలై ఎలాంటి ఆదరణ లేక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులుగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. వర్సిటీలు కేంద్రంగా పని చేసిన విద్యార్థి నాయకత్వాన్ని, వాళ్ల త్యాగాలను గుర్తించాలె. వారిని తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా ప్రకటించాలి. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ కంటే ముందు ఏర్పడిన జార్ఖండ్, చత్తీస్‌‌గఢ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆ ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. వాటిలో కొన్నింటినైనా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే ఆదర్శంగా ఉంటుంది.
- సాదు రాజేశ్, కేయూ విద్యార్థి జేఏసీ మాజీ చైర్మన్

ఉద్యమకారులను గుర్తించాలె

తెలంగాణ కోసం కేసీఆర్ దీక్షకు దిగినప్పుడు కాంగ్రెస్‌‌లో ఉన్న నేను టీఆర్ఎస్‌‌లో చేరిన. తెలంగాణవ్యాప్తంగా జరిగిన అనేక ఉద్యమాల్లో పని చేసిన. తెలంగాణ రాక ముందు టీఆర్‌‌ఎస్‌‌ ఒక కుటుంబంలాగా ఉండేది. ఎవరికి ఏ ఆపద వచ్చినా స్పందించేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్లు స్వార్థపరులుగా మారారు. తమ కుటుంబం బాగుంటే చాలనుకుంటున్నరు. ఉద్యమకారులకు విలువలేకుండా పోయింది. ఉద్యమం సమయంలో కాంగ్రెస్‌‌, టీడీపీ నాయకులతో మాకు వ్యక్తిగతంగా గొడవల్లేవు. తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడం లేదనే కోపంతోనే నేను చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై చెప్పులతో దాడి చేసిన. ఇప్పటి వరకు నా మీద 153 కేసులు నమోదైనయి. ఢిల్లీలో పార్లమెంట్ సెక్రటరీని కొట్టానని ఓ కేసు నమోదైంది. ఈ కేసులో నేను ఏ1ను. కానీ ఈ కేసులో ఏ2గా ఉన్న వ్యక్తికి సన్మానం చేసి, నన్ను పట్టించుకోలేదు. నేను ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్న. ఇవ్వాళ పదవుల్లో ఉన్నవాళ్లు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నరు. ఏదైనా మీటింగ్ జరిగితే ఉద్యమంలో లేనోళ్లు వేదికలపైన ఉంటే.. మేం కింద కూర్చోవాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నన్ను బిడ్డలెక్క చూస్తుండె. ఎన్నో సార్లు ఆయనతో కలిసి భోజనం చేసిన. కానీ ఇప్పుడు అపాయింట్‌‌మెంట్ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించాలె.
- రహీమున్నీసా బేగం, తెలంగాణ యాక్టివిస్టు, వరంగల్

ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతున్నయ్

సీఎం కేసీఆర్​నాయకత్వంలో ఈ ఎనిమిదేండ్లలో అద్భుతంగా పనిచేసినం. ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తి అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి నీళ్లొస్తున్నయి. ఉద్యోగ నియామకాలు కూడా ఒక్క ఖాళీ లేకుండా నింపుతున్నాం. ఈ ఎనిమిదేండ్లలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజలకు ఇచ్చిన ప్రతీమాటను నిలబెట్టుకుంటూ టీఆర్ఎస్​ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. తెలంగాణలో మంచి పంటలు పండుతున్నాయి. ప్రజల సహకారం, ఆశిస్సులు ఉంటే రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. ప్రతిపక్షాలు ఓర్వలేక కొన్ని పసలేని విమర్శలు చేస్తున్నాయి. ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం కూడా కక్షపూరితంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది. ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర అవతరణ వేడుకలు జరపలేదు కానీ..ఈసారి మొదటిసారిగా జరిపే ప్రక్రియ చేపడుతోంది. కేంద్రం జరపడం సంతోషమే కానీ.. రాష్ట్రానికి ఇయ్యాల్సిన డబ్బులు ఇవ్వాలె. దాదాపు రూ.9 వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇయ్యాల్సి ఉండగా.. కేంద్రం పెండింగ్​లో పెట్టింది. వెంటనే డబ్బులను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తున్నం.

- టి. హరీశ్​రావు, వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి

రాష్ట్ర అప్పులు.. పాలకుల సంపదే పెరిగింది

ప్రత్యేక రాష్ట్రమైతే వచ్చిందిగానీ, ఆత్మగౌరవంతో కూడిన సామాజిక తెలంగాణ రాలేదు. మిగులు నిధులతో ఏర్పడ్డ రాష్ట్రం.. ఈ ఎనిమిది ఏండ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని నడుపుతున్న టీఆర్‌‌‌‌ఎస్‌‌ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. కేసీఆర్ తాను దేశ్‌‌కీ నేత అనిపించుకోవడం కోసం రాష్ట్ర ప్రజల సొమ్మును పట్టుకుపోయి ఇంకెక్కడో దుబారా చేస్తున్నడు. 8 ఏండ్ల నుంచి ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్‌‌మెంట్, హౌజింగ్‌‌ను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా కొట్లాడినం. కానీ, ఇప్పుడు అలాంటి సంస్థలే రాజ్యమేలుతున్నయి. వర్సిటీలను నాశనం చేశారు. ప్రభుత్వ దవాఖాన్ల దుస్థితి ఏంటో కరోనా సమయంలోనే తెలిసిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు 1.91 లక్షల వరకు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెబితే.. అందులో సగం కూడా రిక్రూట్‌‌ చేయలేదు. స్వయం ఉపాధి లోన్లు కూడా ఇవ్వలేదు. ఏమన్నంటే పెన్షన్లు ఇచ్చినం, కల్యాణలక్ష్మి ఇచ్చినం, రంజాన్ నాడు ఇఫ్తార్ ఇచ్చినం అని మసిపూసి మారేడు కాయ చేస్తున్నరు. హైదరాబాద్ డెవలప్ చేసినం అంటున్నరు. హైదరాబాద్ ఎవరున్నా డెవలప్ అయితది. తెలంగాణ అభివృద్ధిని కేసీఆర్ రియల్ ఎస్టేట్‌‌ మైండ్ సెట్‌‌తో చూస్తున్నరు. ప్రశ్నిస్తే అణచివేస్తున్నరు. ఆర్టీఐ చట్టాన్ని నీరుగార్చారు. కరప్షన్ పెరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ప్రగతి భవన్‌‌ దాకా లంచం ఇస్తే తప్ప జనాలకు ఏ పనీ అవడం లేదు. ఈ పరిస్థితులు చూసి అనవసరంగా తెలంగాణ కోసం కొట్లాడినం అని జనాలు ఫీలవుతున్నరు.
- దాసోజు శ్రవణ్‌‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి

ఉద్యమ లక్ష్యాలు నెరవేరలే

జల్, జంగిల్, జమీన్‌‌ తెలంగాణ బిడ్డలకు దక్కాలనే ఉద్యమం నడిచింది. దోపిడీ, అణచివేత, అవమానాలు, అంతర్గత వలస పాలన నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగింది. కానీ ఈ ఎనిమిదేండ్లలో ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదు. పోలవరం ద్వారా గోదావరి నీళ్లు, పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రాకే పోతున్నయి. పోలవరం కోసం ఆంధ్రాకు వదిలేసిన ఏడు మండలాల్లో 4 లక్షల మంది కోయలు, కొండరెడ్లు నిర్వాసితులవుతున్నరు. దీన్ని అభివృద్ధి అంటరో, విధ్వంసం అంటరో పాలకులే చెప్పాలి. దీనిపై ఏ పార్టీ మాట్లాడడం లేదు. వజ్రాల ఆన్వేషణ పేరుతో నల్లమల అడవుల నుంచి చెంచులను తరిమేస్తున్నరు. ధరణి కొందరికి కుంకుమ భరిణె అయ్యింది. కానీ ఇదే ధరణితో చాలా మంది భూములపై హక్కు కోల్పోయారు. కాంట్రాక్టర్లంతా ఆంధ్రోళ్లే. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రోళ్ల చేతిలోనే ఉంది. తెలంగాణ అంతా ఆగమైపోయింది.
- పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు

సమైక్య పాలన కంటే అధ్వానం

ఎనిమిదేండ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రమొస్తే విద్య, వైద్యం, ఉపాధి పెరుగుతుందని భావించాం. కానీ ఉమ్మడి ఏపీ కంటే అధ్వానంగా తయారైంది విద్యారంగ పరిస్థితి. బడ్జెట్‌‌లో 6 శాతం నిధులే ఇస్తున్నారు. గొర్రెలు, బర్రెలు, చేపలు అని కులాల పేరుతో ఉపాధిని అటకెక్కించారు. జాబ్ క్యాలెండర్ వేయకపోవడంతో యువత నైరాశ్యంలోకి వెళ్లింది. వర్సిటీలను బ్రష్టు పట్టించి ప్రైవేటు వర్సిటీలను తీసుకొచ్చి బహుజనులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. కాంట్రాక్టులను ఆంధ్రోళ్లకే ఇస్తున్నారు.  ప్రగతి భవన్ నుంచి ఫామ్‌‌హౌస్‌‌కు తిరగడానికి ప్రజా ధనం వృథా చేస్తున్నారు. మిగులు బడ్జెట్‌‌లో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు. విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందినప్పుడే రాష్ట్రం సాధించుకున్నందుకు సార్థకత ఉంటుంది.
- బాలలక్ష్మి, ఓయూ జేఏసీ మాజీ నేత

తెలంగాణ వద్దన్నోళ్లు మంత్రులైన్రు

ఉద్యమ సమయంలో చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా సక్కగా చేయలేదు. రాష్ట్రం కొత్తగా వచ్చిందని.. తొందరపడొద్దని ఐదేండ్లపాటు కలిసి పనిచేయాలకున్నం. రెండో టెర్మ్‌‌లోనైనా మంచి ఫలితాలు వస్తయని, బాగుపడతమని ఆశించినం. కానీ రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక విశ్వరూపం చూపించారు. తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది పైగా ఆంధ్రా ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక వెళ్లిపోతే.. ఆ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు వస్తయనుకున్నం. అవి రాకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. నాడు రాష్ట్ర బాగు కోసం కేసీఆర్‌‌ పోరాడలేదని, ఆయన కుటుంబం కోసమే ఇదంతా చేశారని ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు ఉద్యమంలో మమ్మల్ని తరిమితరిమి కొట్టినోళ్లు, కొట్టించినోళ్లు తెలంగాణ ద్రోహులంతా ఇప్పుడు కేబినెట్‌‌లో ఉన్నరు. ఇది తలచుకుంటేనే బాధనిపిస్తున్నది. తెలంగాణ వద్దన్నోళ్లు ఇప్పుడు కేసీఆర్‌‌తో ఉన్నరు. తెగించి కొట్లాడి ఆస్తులను పోగొట్టుకున్నోళ్లు బయట ఉన్నరు. ఇది ఎంత వరకు సమంజసం? ఇలాంటి వాళ్లతో ఆవిర్భావ ఉత్సవాల్లో కేసీఆర్‌‌ ఎట్ల పాల్గొంటరు? ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలి.
- కె.స్వామి గౌడ్‌‌, బీజేపీ నేత

రైతులకు బేడీలు వేసేందుకా తెలంగాణ తెచ్చుకున్నది?

ఎన్నో త్యాగాలు, సబ్బండ వర్గాల పోరాటంతో తెలంగాణ కల సాకారమైంది. రాష్ర్టం సాధించుకున్నది కొందరు వ్యక్తుల కోసం కాదు. అందరి కోసం. కానీ ఈ 8 ఏండ్లలో విలువలు దిగజారిపోయినయ్. నిరంకుశ, ఏకవ్యక్తి పాలన సాగుతున్నది. కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య రాష్ర్టంగా మారింది. ఉద్యమ ద్రోహులు ఇపుడు కేబినెట్‌‌లో ఉన్నరు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇరిగేషన్‌‌లో అద్భుతాలు సాధించినమని చెప్పుకుంటున్నరు. కాళేశ్వరం ఫలాలు చెప్పమంటే.. కేసీఆర్ నుంచి ఇప్పటికీ సమాధానం లేదు. కేసీఆర్ ఆయన కొడుకు, కూతురు, అల్లుడు నిరంతరం అబద్ధాలు అందంగా చెప్పే పనిలో ఉన్నరు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. రాష్ర్ట హక్కులను హరిస్తోందని కేసీఆర్, ఆయన కుటుంబం విమర్శిస్తోంది. ఉద్యమకారుల హక్కులను, స్ఫూర్తిని మింగేసిన కేసీఆర్ కుటుంబానికి ఇంకొకరిని  విమర్శించే నైతిక హక్కు లేదు. ఉద్యమంలో పీడీ యాక్టు వల్ల నా లాంటి ఎంతో మంది జైలుకు వెళ్లారు. రైతులకు, ఆదీవాసీలకు బేడీలు వేయటానికి కాదు తెలంగాణ సాధించుకున్నది. ప్రజల కలలు సాకారమయ్యే దాకా పోరాడుతూనే ఉంటం. 
- చెరుకు సుధాకర్, తెలంగాణ ఉద్యమ నాయకుడు

ఒక్కో సమస్య పరిష్కారమైతంది

తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటంతో రాష్ట్రం ఏర్పాటైంది. గత 8 ఏండ్లలో తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఇది అపూర్వ పక్రియ. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం తల్లడిల్లిన తెలంగాణ.. ఒక్కో సమస్యను పరిష్కరించకుంటూ ముందుకెళుతోంది. తెలంగాణను మరింత డెవలప్​చేసుకోవడానికి అన్ని రకాల శక్తులు పనిచేయాలి. పార్టీలు అభివృద్ధికి అడ్డుపడకూడదు. అమరవీరుల ఆకాంక్షలు, కలలు సాకరమవుతున్న 
ఈ సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వీరులందరికీ జోహార్లు.
- దేవి ప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు

ఒక్క కుటుంబం కోసం ఉద్యమం జరగలే

నేను సిద్దిపేట జిల్లాలో జైల్‌‌గార్డ్‌‌ డ్యూటీ చేస్తున్నాను. 2013 సెప్టెంబర్‌‌ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏపీ ఎన్జీఓల సభలో గజల్‌‌ శ్రీనివాస్‌‌ తెలంగాణ తల్లిని కించపరిచాడు. సభకు వచ్చిన వాళ్లు తెలంగాణ ప్రజల గురించి నీచంగా మాట్లాడడం చూసి తట్టుకోలేకపోయిన. పట్టలేని ఆవేశంతో జై తెలంగాణ నినాదాలు చేసిన. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా నేను అన్ని రకాలుగా వేధింపులకు గురవుతూనే ఉన్న. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒకే వర్గానికి చెందిన వారికే లబ్ధి చేకూరుతోంది. ఒక్క కుటుంబం కోసమే అయితే ఉద్యమాలు రాకపోతుండే. ఏ ఒక్కరు బలిదానం చేసుకోకపోతుండె. అమరులైన వారి ఆకాంక్షలు నెరవేరే పరిస్థితులు ఇప్పుడు లేవు. మిగులు బడ్జెట్‌‌లో ఉన్న ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పుల దిశగా వెళ్తుంది. తెచ్చిన అప్పు ఎక్కడికి పోతున్నది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2017లో నన్ను అకారణంగా ఏడాది కాలం సస్పెండ్‌‌ చేశారు. 2018లో విధుల్లోకి తీసుకున్నారు. సర్వీస్ రూల్స్‌‌, పోలీస్‌‌ మ్యాన్యువల్‌‌ ప్రకారం నాపై ఎంక్వైరీలు వేశారు. నేను ఎమ్మెల్యే టికెట్‌‌ ఆశిస్తున్నట్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌‌, మంత్రి హరీశ్‌‌రావు‌‌ను కలిసేందుకు చాన్స్​ ఇవ్వడం లేదు. ఉద్యమకారులను, ఉద్యోగులను ఇకనైనా గుర్తించాలి.
- కయ్యాడ శ్రీనివాస్‌‌ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్‌‌, సిద్దిపేట

ఎవని పాలయిందిరో తెలంగాణ

‘‘గోసి గొంగడేసి.. కాలి గజ్జెలు కట్టి.. డప్పు సంకనేసి.. ఊరు ఊరుకు పోయి.. పోరు పాటలు పాడితే.. ఎవని పాలయిందిరో తెలంగాణ.. ఎవడు ఏలుతున్నడురో తెలంగాణ..’’ అని ప్రశ్నించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. మారోజు వీరన్న, బెల్లి లలితక్క, తొర్రూరు ఐలన్న త్యాగాలకు విలువ లేకుండా పోయింది. గద్దరన్న నెత్తురు ధారపోశాడు. కాళోజీ, దాశరథి, జయశంకర్‌‌ సారు, బియ్యాల జనార్దన్‌‌ సార్‌‌ లాంటి వాళ్లు కలలుగన్న తెలంగాణ కనుచూపు మేరలోనైనా కనిపించడం లేదు. స్వరాష్ట్రమొస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని కలలు కని పాట, ఆట, మాటతో కోట్లాది మంది తెలంగాణ బిడ్డలను చైతన్యవంతం చేసినం. కానీ ఇయ్యాల కొంత మంది చేతిలో రాష్ట్రం బందీ అయింది. స్వరాష్ట్ర ఫలాలు ప్రజలకు, సబ్బండ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అందటం లేదు. ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఉపయోగపడేలా ఉండే తెలంగాణ కావాలనేది మా డిమాండ్. నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికి వచ్చినయి, ఏ కుటుంబం అనుభవిస్తున్నది. ప్రజలకు, ఉద్యమకారులకు ఒరిగిందేమి లేదు. దోపిడీ ఆగాలంటే మరో పోరాటం చేయాలె. సబ్బండ వర్గాలకు సంక్షేమం అందాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా యువత పోరాటాలు చేయాలి.
- ఏపూరి సోమన్న, వైఎస్సార్‌‌టీపీ నాయకుడు