నిమ్స్‌‌ అభివృద్ధికి అప్పు చేయండి

నిమ్స్‌‌ అభివృద్ధికి అప్పు చేయండి

నిమ్స్‌‌ అభివృద్ధికి అప్పు చేయండి

హైదరాబాద్, వెలుగు : నిమ్స్ హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్ట్‌‌ కోసం రూ.1,571 కోట్లు అప్పు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీవో జారీ చేసింది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా  తీసుకోవాలని నిమ్స్‌‌ డైరెక్టర్‌‌‌‌కు సూచించింది. ఇందుకోసం ఎస్‌‌బీఐ క్యాపిటల్స్, టీఎస్‌‌ఎస్‌‌హెచ్‌‌సీఎల్‌‌ సాయం తీసుకోవాలని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న హాస్పిటల్స్ కోసం అప్పులు తీసుకోవడానికి తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌(టీఎస్‌‌ఎస్‌‌హెచ్‌‌సీఎల్‌‌) అనే సంస్థను ప్రభుత్వం గతేడాది  ఏర్పాటు చేసింది.  ఈ కార్పొరేషన్‌‌కు ఎస్‌‌బీఎస్‌‌ క్యాపిటల్స్‌‌ నోడల్ సంస్థగా వ్యవహరిస్తోంది. ఎస్‌‌బీఐ క్యాపిటల్స్‌‌ బ్యాంకులతో రాయబారం చేసి  టీఎస్‌‌ఎస్‌‌హెచ్‌‌సీఎల్‌‌కు అప్పులు ఇప్పిస్తోంది. ఈ అప్పులతోనే హనుమకొండలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌, హైదరాబాద్‌‌ చుట్టు పక్కల సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు.

ఇప్పుడు నిమ్స్‌‌ ఎక్స్‌‌పాన్షన్ ప్రాజెక్టుకు కూడా అప్పు తీసుకోనున్నారు. అప్పు తీసుకున్న డబ్బులతో నిమ్స్‌‌కు అనుబంధంగా మరో రెండు కొత్త బిల్డింగులు నిర్మించనున్నారు. వీటిలో 1,500 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. నర్సింగ్ ట్రైనింగ్ కూడా ఇక్కడే ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా, నిమ్స్ విస్తరణకు అనుమతించిన సీఎం కేసీఆర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా మరో కీలక ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.