
మరోసారి ఆంక్షలు పెట్టిన రాష్ట్ర సర్కార్
రాజకీయ, మత కార్యక్రమాలపై పూర్తి నిషేధం
నైట్ కర్ఫ్యూను 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలను 100 మందితోనే చేసుకోవాలని, అంతకుమించి అనుమతి లేదని వెల్లడించింది. అంత్యక్రియలకు 20 మంది కన్నా ఎక్కువ హాజరు కావొద్దని సూచించింది. కొత్త ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం విడుదల చేశారు. అన్ని కార్యాల్లోనూ మాస్క్ తప్పనిసరని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని, కరోనా రూల్స్ పాటిస్తూ కార్యక్రమాలు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అకడమిక్, మత, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం విధించారు.
పెళ్లిళ్లకు ఎదురుదెబ్బ
కరోనా వల్ల నిరుడు పెళ్లిళ్లలపై ఆధారపడే చాలా వ్యాపారాలపై పెద్ద దెబ్బ పడింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆంక్షలతో మళ్లీ వాళ్లంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికే చాలామంది ఉపాధి లేక విలవిల్లాడుతున్నారు. రోజుకూలీల దగ్గర్నుంచి ఫంక్షన్ హాళ్ల యజమానులు, ఈవెంట్ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, కేటరింగ్, డెకరేషన్ వ్యాపారులు నష్టపోతున్నారు. కేసులు పెరిగిపోతుండడంతో ఫంక్షన్ల కోసం ఇప్పటికే చేసుకున్న బుకింగ్లనూ చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నారు. కర్ఫ్యూ పొడిగింపు రాష్ట్రంలో అమలవుతున్న రాత్రి కర్ఫ్యూను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 15 వరకు ఇప్పుడున్న ఆంక్షలే అమల్లో ఉంటాయని వెల్లడించింది. గత నెల 20వ తేదీన నైట్ కర్ఫ్యూను ప్రకటించగా.. 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఈనెల 1న సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. శనివారంతో ఆ గడువు పూర్తి కానుండడంతో 15వ తేదీ వరకు మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. అత్యవసర సేవలైన హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మెడికల్ షాపులు, మీడియాకు మినహాయింపులను ఇచ్చింది.