రాహుల్ ప్రసంగంలో పసలేని అనువాదం..

రాహుల్ ప్రసంగంలో పసలేని అనువాదం..

హైదరాబాద్​, వెలుగు: రాహుల్​గాంధీ  ప్రసంగంలోని ‘పంచ్​’ తెలుగు అనువాదంలో మిస్​ అయింది. టీఆర్​ఎస్​ సర్కార్​పై, కేసీఆర్​పై రాహుల్​ పదునైన విమర్శలు చేశారు. కానీ దాన్ని తెలుగులో అనువదించి చెప్పే క్రమంలో ఆ పంచ్​ లేకుండా పోయిందని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు రాహుల్​ స్పీచ్​ను తెలుగులోకి  అనువదించారు. కేసీఆర్​ సీఎం కాదని, ఆయన ఒక రాజు అంటూ రాహుల్​ రెండింటికి మధ్య తేడా ఏమిటో సూటిగా వివరించారు. కేసీఆర్​పై రాహుల్​ చేసిన కామెంట్లను, ఆయన మాట తీరును అనువాదంలో శ్రీధర్​బాబు ప్రతిబింబించలేకపోయారని కొందరు నేతలు అన్నారు. చాలా చోట్ల రాహుల్​ చెప్పిన విషయానికి ‘మనవి చేస్తున్నాను’ అనే మాటను అనువాదంలో చేర్చడం కూడా రాహుల్​ స్పీచ్​ సీరియస్​నెస్​ను దెబ్బతీసింది. కేసీఆర్​ సర్కార్​పై తమ పోరాటాన్ని రాహుల్​ గట్టిగా చెప్పారు. ఎంత పెద్ద నేత అయినా సరే టీఆర్​ఎస్​కు మద్దతు పలికినా, ఆ పార్టీతో పొత్తు కోరినా కాంగ్రెస్​ నుంచి బయటకు పంపుతామని ఆయన  హెచ్చరించారు. అయితే వీటితోపాటు అనేక విషయాలు అనువాదంలో సాదాసీదాగా అనిపించాయని కొందరు నేతలు వ్యాఖ్యానించారు.