మూడో రోజు టింబర్ లోనే ఆదివాసులు

మూడో రోజు టింబర్ లోనే ఆదివాసులు
  •  స్వగ్రామాలకు వెళ్లాలన్న ఆఫీసర్లు
  •  కొలంగోందిగూడలోనే ఉంటామన్న ఆదివాసీలు

కాగజ్​నగర్, వెలుగు: గూడు చెదిరిన ఆదివాసీలకు మూడో రోజు కూడా టింబర్​ డిపోనే దిక్కయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కొలంగోందిగూడలోని 16 కుటుంబాల ఇండ్లను అటవీ ఆఫీసర్లు బుధవారం సాయంత్రం కూల్చివేయడంతో వారంతా టింబర్​డిపోలో ఆశ్రయం పొందారు. జిల్లా గిరిజన సంక్షేమాధికారి దిలీప్​కుమార్, ​సహాయ గిరిజన సంక్షేమాధికారి నీలిమ తో కలిసి శుక్రవారం గిరిజనులు ఆశ్రయం పొందుతున్న టింబర్​ డిపోకు చేరుకున్నారు. స్థానిక అటవీ రేంజ్​ అధికారి అనితను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఐదేళ్ల క్రితం గిరిజనులు కొలంగోందిగూడకు వచ్చారని ఒకటి, రెండు కుటుంబాలు తప్ప మిగిలినవారంతా వలస వచ్చారని, వీరు పోడు సాగు చేయడంతో అడవులకు నష్టం జరుగుతోందని, అందువల్లే ఖాళీ చేయించామని రేంజ్​ అధికారి వివరించారు.  అనంతరం గిరిజనులతో డీటీడీఓ దిలీప్​ మాట్లాడుతూ  మీరు మీ పాత గ్రామాలకు తిరిగి వెళ్తే అక్కడ జీవనోపాధికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అడవులను నరికి వ్యవసాయం చేయడాన్ని చట్టం ఒప్పుకోదని, మీకు పునరావాసం కల్పించేందుకు ఐటీడీఏ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బడీడు పిల్లలను ఆశ్రమ స్కూల్​లో చేర్పించి  సమస్య పరిష్కారమయ్యేవరకు అందులోనే ఉంచుతామన్నారు. పాత గ్రామాలకు తరలివెళ్తే పునరావాసం కల్పిస్తామన్నారు. దీనికి గిరిజనులు ససేమీరా అన్నారు. తమకు ఎక్కడా భూమి, జాగలు లేవని, ఎక్కడికి పోబోమని.. కొలంగోందిగూడలోనే ఉంటామని తేల్చి చెప్పారు.