- మున్సిపల్ ఎన్నికల ముందు అధికార పార్టీలో కలకలం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్‌పై పీసీసీ నాయకత్వం ఆరా తీసింది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆయన గాంధీ భవన్ వర్గాల ద్వారా సమాచారం రాబట్టారు. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పది నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కోసం పీసీసీ ప్రత్యేక కమిటీలను నియమించేందుకు సిద్ధమైంది.
కాగా, ఈలోపే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం తన నియోజకవర్గంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానని.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన బహిరంగంగా చేసిన కామెంట్స్ అధికారపార్టీలో కలకలం రేపాయి. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఇదే దారిలో నడిస్తే.. కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందని భావిస్తున్న పీసీసీ నాయకత్వం.. వలస వచ్చిన ఎమ్మెల్యేలను బుజ్జగించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యత వారికే అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
కాగా, పార్టీలో చేరిన 10మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆందోళనతో ఉన్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. తమవారికి పార్టీ పదవులతో పాటు, పంచాయతీ ఎన్నికల్లో సీట్లు దక్కలేదని, తీరా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ దక్కే అవకాశాలు లేవని భావిస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు తమను టార్గెట్‌చేసి తిడుతున్నా హైకమాండ్ కంట్రోల్ చేయలేకపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిరేపుతోంది.
