పోడు పట్టాలు దక్కేది కొందరికేనా..

పోడు పట్టాలు దక్కేది కొందరికేనా..
  • లిస్ట్​ అంతా సీక్రెట్​ గా ఉంచిన అధికారులు..

మహబూబాబాద్​, వెలుగు:  జిల్లాలో నేడు పోడు పట్టాల పంపిణీ జరుగనుంది. పంపిణీకి ముందే ఫైనల్​ లిస్ట్​  రిలీజ్​ చేయకపోవడంతో  కొందరు  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టాల కోసం రైతుల నుంచి భారీగా డబ్బుల వసూళ్లు చేశారన్న ఆరోపణలు వినిపించాయి.  ఏండ్లుగా భూమి సాగు చేసుకుంటున్నా తమకు పోడు పట్టా అందడం లేదని గిరిజనేతరులు ఆవేదన చెందుతున్నారు.   ఫారెస్ట్​, రెవెన్యూ ఆఫీసర్ల  కోఆర్డినేషన్​ లేకపోవడంతో  అనేక మంది గిరిజన రైతులకు నష్టం   జరుగుతున్నట్టు తెలుస్తోందంటున్నారు. 

గిరిజన రైతులు పోడు సాగు చేసుకుంటున్న   భూములను గ్రామ ఎఫ్​ ఆర్​సీ కమిటీల ఆధ్వర్యంలో  సర్వే చేశారు. నివేదికను జిల్లా ఎఫ్​ఆర్​సీ కమిటీకి పంపారు. నేచురల్​ ఫారెస్ట్​, ఓల్డ్​ ప్లాంటేషనులు లేనప్పటికి. కొత్తగూడ మండలంలో 307 మంది గిరిజన రైతులకు, గంగారం మండలంలో 766 మంది గిరిజన రైతులకు పట్టాలు మంజూరు చేయలేదు. గ్రామాల వారిగా పోడుపట్టాల అర్హత సాధించిన రైతుల వివరాలను డిస్​ప్లే చేయకపోవడంతో  పోడు రైతులు తమ   భూముల వివరాలు సక్రమంగా నమోదు చేశారో లేదో అని ఆందోళనకు గురవుతున్నారు. లిస్టు  ముందు రిలీజ్​ చేస్తే ఆందోళనలు జరుగుతాయని ఆఫీసర్లు  భావించారు.    అధికారులు ఫీల్డ్​విజిట్​ చేసి శాంతింపచేస్తున్నారు. 

పోరు తప్పదా? 

గిరిజనేతర రైతులు  1930  నుంచి సుమారుగా 75  ఏండ్లుగా  నివాసం ఉండి, పోడు సాగు చేసుకున్నట్టయితే పట్టాలకు అర్హులని నిబంధన విధించారు. దీంతో చాలామంది గిరిజనేతరులకు పట్టాలు దక్కడం లేదు.  మహబూబాబాద్​జిల్లాలో బయ్యారం మండలంలో 1319, గంగారం 759, గార్ల11, గూడూరు 1636, కేసముద్రం1454, కొత్తగూడ3474, కురవి29, మహబూబాబాద్​809, నెల్లికుదరు768 గిరిజనేతర రైతులు పోడు పట్టాల కోసం అప్లయ్​  చేసుకున్నారు. అయితే వీరిలో ఎవరెవరికి పట్టాలు దక్కుతాయే  అన్నది ఇంకా తేలలేదు.  గిరిజనేతర రైతులు మంత్రి కేటీఆర్​  హజరయ్యే సభలోనే తమ నిరసన గళం వినిపించడం కోసం సిద్దమవుతున్నారు. 

ఏజెన్సీ ఏరియాలో జోరుగా వసూళ్లు !

ఏజెన్సీ ఏరియాలో  పోడు పట్టాల పంపిణీలో కొంతమంది  దళారులు పోడు రైతుల  నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు.  పోడు భూమికి పట్టాలు రావాలంటే  రెవెన్యూ, ఫారెస్టు ఆఫీసర్లకు ముడుపులు ఇవ్వాల్సందేనని  దళారులు గిరిజన రైతులు  నుంచి డబ్బులు గుంజినట్టు తెలుస్తోంది.   

 మాకు పోడు పట్టాలను అందించాలి

 మహబూబాబాద్​ జిల్లా  గంగారం మండలం తిరుమల గండి గ్రామంలో 38 మంది ఆదివాసి రైతుల పట్టాలను పక్కన బెట్టారు. మా భూముల్లో నేచురల్​ ఫారెస్ట్​, ఓల్డ్​ ప్లాంటేషన్​ లేదు. 20 ఏళ్ల నుంచి అగ్రికల్చర్​ చేసుకుంటున్నాం. మాకు పట్టాలు మంజూరు చేయక పోవడం దారుణం. ఫారెస్ట్​ ఆఫీసర్ల వద్దకు వెల్లి అడిగాము, ఫీల్డ్​లో పరిశీలించారు ఏమి చెప్పకుండానే వెల్లిపోయారు. మా గ్రామంలో అర్హులందరకి పోడు పట్టాలు ఇవ్వాలి

 – బోడ సురేశ్​​, పోడు రైతు,తిరుమల గండి గ్రామం, గంగారం మండలం