నకిలీ చలానా​ స్కాంను అటకెక్కించిన్రు!

నకిలీ చలానా​ స్కాంను అటకెక్కించిన్రు!
  • రూ.62 కోట్లు వసూలు చేసి  మమ అనిపించిన ఆఫీసర్లు
  •  ఇంకా వసూలు చేయాల్సిన మొత్తం రూ.200కోట్లు
  •  కీలక నిందితులు  ఇప్పుడు రూలింగ్​ పార్టీలో!
  • అందుకే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు
  • బ్యాంకుల్లో చెక్కులు బౌన్స్​ 

 నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లో సంచలనం సృష్టించిన రూ.260 కోట్ల నకిలీ చలానా ​స్కాంను రాష్ట్ర సర్కారు అటకెక్కించింది. స్కాం బయటపడి మూడున్నరేండ్లు గడుస్తున్నా నేటికీ నిందితులపై చర్యలు లేవు. కనీసం సొమ్మయినా రికవరీ చేశారా అంటే అదీ లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్లు రాష్ట్ర ఖజానాకు రావాల్సి ఉంది. స్కాంలోని కీలక నిందితుల్లో కొందరు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని.. అందుకే ఈ కేసును రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 
ఎలా జరిగిందంటే..
ఆకాశరామన్న పేరుతో 2017 డిసెంబర్​లో కమర్షియల్ ​ట్యాక్స్ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్​కు ఒక లెటర్​వచ్చింది. అందులో నకిలీ చలాన్లతో రైస్​మిల్లర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల ఓనర్లు రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని ఉంది. దాని ఆధారంగా ఆఫీసర్లు విచారణ చేపట్టగా తీగ లాగితే డొంక కదిలింది. 2009 నుంచి 2014వరకు బోధన్ కమర్షియల్ ​ట్యాక్స్​సర్కిల్ ఆఫీస్​లో పనిచేసిన ఆఫీసర్ల కనుసన్నల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఎఫ్​సీఐ (ఫుడ్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి సరఫరా చేసే బియ్యానికి సంబంధించిన బిల్లుల మొత్తంలో 5% కమర్షియల్ ​ట్యాక్స్ ​కింద రాష్ట్ర ఖజానాకు జమ కావాలి. అయితే 2013వరకు ఈ సొమ్మును మిల్లర్లే చలాన్ల రూపంలో ట్రెజరీలో జమ చేసేవారు. ఈ క్రమంలో నకిలీ చలాన్లతో మిల్లర్లు అక్రమ దందాకు తెరలేపారు. అలా వందల కోట్లు లూటీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన రైస్​మిల్లర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు నకిలీ చలాన్లతో పన్ను ఎగ్గొట్టారని తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ నకిలీ చలాన్ల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విజిలెన్స్, సీబీసీఐడీని ఆదేశించింది.
500 కాదు.. 260 కోట్లే
మూడు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభుత్వం కొందరు ఆఫీసర్లను సస్పెండ్​ చేసింది. స్కాంలో కీలక సూత్రధారి అయిన ఇన్​కం ట్యాక్స్ ఆఫీసర్​శివరాజ్​ను పోలీసులు అరెస్టు చేశారు. మొదట రూ.500 కోట్లు స్కాం జరిగిందని ప్రచారం జరగ్గా విజిలెన్స్, సీబీసీఐడీ ఆఫీసర్లు రూ.260 కోట్ల స్కాం జరిగినట్లు నివేదిక ఇచ్చారు. అనంతరం స్కాంలో ఇన్వాల్వ్​అయిన150 మందికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నకిలీ చలాన్లతో కాజేసిన సొమ్మును తిరిగి జమచేయాలని, లేదంటే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని పేర్కొంది. కొంత మంది వ్యాపారులు రిప్యుటేషన్​ దెబ్బతింటుందని చెల్లించారు. కానీ ఇప్పటివరకు రూ.260 కోట్లలో కేవలం రూ.62కోట్లను మాత్రమే ప్రభుత్వం రికవరీ చేయగలిగింది.
స్కాంలో నోటీసులు అందుకున్న వ్యక్తులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు  చెక్కులు సమర్పించారు. వాటిని బ్యాంకుల్లో వేయగా బౌన్స్ అయ్యాయి. కానీ ఈ వ్యవహారం బయటికి రాలేదు. చెక్కులు ఉన్నందున వారే చెల్లిస్తారని అధికారులు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. చెక్కుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఖజానాకు దాదాపు రూ.200కోట్లు రావాల్సి ఉన్నా ప్రభుత్వం గమ్మునుండడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైస్​మిల్లర్ల సంఘం నాయకులు కొందరు టీఆర్ఎస్​లో చేరడం వల్లే స్కాం కేసు అటకెక్కిందనే ఆరోపిస్తున్నాయి. ఫేక్​చలాన్​ స్కాంలో ఉన్న అధికారులు, కింది స్థాయి ఉద్యోగులకు నిజామాబాద్ డివిజన్ దాటి బదిలీలు, పదోన్నతులు ఇవ్వొద్దని జారీచేసిన జీవోలకు కాలం చెల్లిపోయింది. రికవరీ మరుగునపడిపోయింది.