ఉస్మానియా యూనివర్సిటీ ‘గ్లోబల్​ అలుమ్నీ’ షురూ

ఉస్మానియా యూనివర్సిటీ ‘గ్లోబల్​ అలుమ్నీ’ షురూ

ఉస్మానియా యూనివర్సిటీ ‘గ్లోబల్​ అలుమ్నీ’ షురూ
ప్రపంచానికి మేధావులను అందించింది: రక్షణ శాఖ సలహాదారు సతీశ్​రెడ్డి
సౌలత్​లు, పరిశోధనలు పెంచాలి: బుర్ర వెంకటేశం
బ్రాండ్​ను ముందుకు తీసుకెళ్లాలి: సీవీ ఆనంద్
ఠాగూర్ ఆడిటోరియంలో ఓల్డ్​స్టూడెంట్ల ప్యానెల్​ డిస్కషన్​ 
ఉత్తమ పరిశోధనా అవార్డుల ప్రదానం చేసిన వీసీ

ఓయూ, వెలుగు : ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని రక్షణ శాఖ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీశ్​రెడ్డి అన్నారు. ఓయూలో రెండ్రోజుల పాటు జరగనున్న ‘గ్లోబల్ అలుమ్నీ మీట్’ వేడుకలు మంగళవారం వర్సిటీలోని టాగూర్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఓల్డ్ స్టూడెంట్లు ఒకే వేదికపై వచ్చారు. దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు ఓల్డ్ స్టూడెంట్లతో ప్యానల్ డిష్కషన్లు నిర్వహించారు. ఇందులో సతీశ్​రెడ్డి మాట్లాడుతూ వందేండ్ల చరిత్ర కలిగిన ఓయూ కేంద్రంగా మరెన్నో స్టార్టప్​లు రావాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ గ్లోబల్ అలుమ్నీ మీట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ఓయూ చరిత్రలో గేమ్ చేంజ్ చేసే స్థాయిలో నిలవాలన్నారు. వర్సిటీలో అంతర్గతంగా సౌలత్ లు కల్పించడం, అకడమిక్, పరిశోధనలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం వర్సిటీ ప్రాధాన్యతలను ఓల్డ్​స్టూడెంట్లకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఓయూ బ్రాండ్​ను మరింత పెంచాలి

ఓయూ బ్రాండ్​ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఓల్డ్ స్టూడెంట్లు తమ వంతు సాయం అందించాలని  సిటీ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఓయూలో చాలా సమస్యలు ఉన్నాయి.. వాటిని గుర్తించాము.. పరిష్కరం కోసం అధికారులతో చర్చించామని తెలిపారు.  తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ వర్సిటీ పేరు, ప్రతిష్ట పెరగాలంటే నాణ్యమైన పరిశోధనలు జరగాలని దాని కోసం విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించాలి అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీలకు ఓయూ ఏ మాత్రం తీసిపోదని టెక్సాస్ యూనివర్సిటీలోని మెటాస్టాసిస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రఘు కల్లూరి అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ సావిత్రీ బాయి ఫూలే ప్రేరణతో అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.  డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఓల్డ్​ స్టూడెంట్​భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగాల గడ్డగా మార్చాలి

ఓయూ వీసీ ప్రొఫెసర్ ​రవీందర్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి పూర్వ విద్యార్ధి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథియే అన్నారు. ఉద్యమాల గడ్డ అయిన ఓయూను ఉద్యోగాల గడ్డగా మార్చాలని పిలుపునిచ్చారు . ఓయూకు పూర్వ విద్యార్థుల సహాకారం కోసం ఇప్పటికే ఉస్మానియా ఫౌండేషన్ పేరిట సెక్షన్ -8 కంపెనీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఓయూలో పరిశోధనను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఏటా జనవరి 3,4 తేదీలలో గ్లోబల్ అలుమ్నీ మీట్ నిర్వహిస్తామన్నారు. ఉత్తమ పరిశోధనా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా స్టూడెంట్లు తయారు చేసిన వస్తువులతో స్టాళ్లు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వవిద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ జి.మల్లేశం, ఓఎస్‌‌డీ బి.రెడ్యా నాయక్, ప్రొఫెసర్లు మంగు, సయ్యదా ఉన్నీసా, చలమల్ల వెంకటేశ్వర్లు, ఆయా విభాగాల డీన్లు, లెక్చరర్లు పాల్గొన్నారు.