ఆ ముగ్గురికి మున్సిపోల్స్ ​సవాల్

ఆ ముగ్గురికి మున్సిపోల్స్ ​సవాల్
  • బీజేపీ ఎంపీలు సంజయ్, అర్వింద్, బాపూరావుల లీడర్​షిప్​కు పరీక్ష
  • వారి సెగ్మెంట్లలో గెలుపుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ
  • శివారు మున్సిపాలిటీలను గెలిపించుకునే బాధ్యత కిషన్​రెడ్డికి

హైదరాబాద్, వెలుగు:

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్లు ముగ్గురు బీజేపీ ఎంపీలకు సవాలుగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుల లీడర్​షిప్​కు ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. ఎంపీ ఎలక్షన్లలో గెలుపు తర్వాత బీజేపీలో మళ్లీ ఆ ఊపు కనిపించడం లేదని.. మున్సిపోల్స్​లో మంచి ఫలితాలు సాధించి సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పార్టీ సిట్టింగ్ ఎంపీల పరిధిలోని మున్సిపాలిటీలపై ఆశ పెట్టుకుంది.

మూడు చోట్లా కీలకమే..

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజకీయాలపై ఎఫెక్ట్​చూపగలవు కూడా. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశ పెట్టుకుంది. ప్రస్తుతం కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్​ ఎంపీ అర్వింద్ దూకుడు మీద ఉన్నారు. టీఆర్ఎస్  వైఫల్యాలను, సీఎం కేసీఆర్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. సొంత పార్టీ నేతలు, కేడర్ కూడా వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక కరీంనగర్  లోక్​సభ సెగ్మెంట్ పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ మున్సిపాల్టీలు ఉన్నాయి. నిజామాబాద్ లోక్​సభ పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటన్నింటిలో గెలుపు బాధ్యత సంజయ్, అర్వింద్​లపై పడింది. ఇక సోయం బాపూరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ లోక్​సభ సెగ్మెంట్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో గెలుపుపైనా పార్టీలో ఆశలు ఉన్నాయి. దీంతో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

కిషన్​రెడ్డిపై శివారు బాధ్యతలు

రాష్ట్రం నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీల్లో కిషన్​రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని జీహెచ్ఎంసీకి ఇప్పుడు ఎన్నికల్లేవు.  హైదరాబాద్ నగర శివార్లలోని మల్కాజ్​గిరి, చేవెళ్ల లోక్​సభ సెగ్మెంట్ల పరిధిలోని ఏడు కార్పొరేషన్లు, 20 వరకు మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట కార్పొరేషన్లు, శంషాబాద్, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, దుండిగల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, పెద్ద అంబర్ పేట్ వంటి కీలక మున్సిపాలిటీలు ఇందులో ఉన్నాయి. సిటీకి ఆనుకుని ఉండడంతో వీటిల్లో గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది.