బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి

బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం తగదని, తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ)  డిమాండ్ చేసింది.  డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం.రఘుశంకర్ రెడ్డి అధ్యక్షతన శనివారం యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం వర్చువల్ గా జరిగింది. ఈ సందర్భంగా డీటీఎఫ్ అధ్యక్షుడు, సంఘం ఇతర నాయకులు మాట్లాడుతూ... వేసవిలో బదిలీలు, పదోన్నతులు చేపడుతామని సీఎం, విద్యా శాఖ మంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా... బదిలీల ప్రక్రియను ఇంకా ప్రారంభించకపోవడం విచారకరమన్నారు. పాఠశాలల్లో టీచర్ల కొరతతో బోధన కుంటుపడుతోందని, రెండేళ్లుగా విద్యా వాలంటీర్ల నియామకాలు చేపట్టకపోవడంతో టీచర్లు, విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.

బదిలీల ప్రక్రియ చేపట్టి తదనంతరం ఏర్పడిన ఖాళీలను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలని, ఈలోగా  విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ సరఫరా చేయాలని, జీఓ 317 అనంతరం ఉపాధ్యాయులకు ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. వేతనాలను ప్రతి నెలా ఒకటో  తేదీనే  విడుదల చేయాలని, సప్లిమెంటరీ బిల్లులను వరుస క్రమంలో జాప్యం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.  బదిలీలషెడ్యూల్ ఇవ్వకుంటే జులై మొదటి వారంలో మహాధర్నా చేస్తామని హెచ్చరించారు.