డైరెక్ట్‌‌గా వెళ్లినా వ్యాక్సిన్‌‌ వేస్తరు

డైరెక్ట్‌‌గా వెళ్లినా వ్యాక్సిన్‌‌ వేస్తరు

కరోనా టీకా సెంటర్​లోనూ రిజిస్ట్రేషన్​

హైదరాబాద్‌‌/హుజూరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్‌‌ కోసం ఆన్‌‌లైన్‌‌లో రిజిస్టర్‌‌ చేసుకోవడం కష్టమనుకునే వారికి ఇంకా సులువైన పద్ధతిని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రకటించింది. నేరుగా వ్యాక్సిన్‌‌ సెంటర్‌‌కు వెళ్లి అప్పటికప్పుడు పేరు, వివరాలు నమోదు చేయించుకుని టీకా తీసుకునే ఆన్‌‌సైట్‌‌ ప్రాసెస్‌‌ను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పింది. డాక్టర్‌‌ సర్టిఫికెట్‌‌కు ఇబ్బంది పడాల్సిన పనేం ఉండదని, సెంటర్ల దగ్గర ఉండే డాక్టర్లే సర్టిఫికెట్‌‌ ఇస్తారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. పాత టెస్ట్‌‌ రిపోర్టులు, ప్రిస్ర్కిప్షన్ చూపిస్తే సరిపోతుందన్నారు. కొవిన్‌‌ పోర్టల్‌‌, ఆరోగ్య సేతు యాప్‌‌లోనూ రిజిస్ట్రేషన్‌‌ కొనసాగుతుందని చెప్పారు.

48 సర్కారు, 45 ప్రైవేట్‌‌ హాస్పిటళ్లలో..

60 ఏండ్లు దాటిన వాళ్లు, 45 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం సెకండ్‌‌ ఫేజ్‌‌ వ్యాక్సినేషన్‌‌ కార్యక్రమం సోమవారం రాష్ట్రంలో ప్రారంభమైంది. పొద్దున 9 గంటల తర్వాత కొవిన్ పోర్టల్‌‌, ఆరోగ్య సేతు యాప్‌‌లో రిజిస్ర్టేషన్ ప్రక్రియ షురువైంది. కరీంనగర్‌‌‌‌ జిల్లా హుజూరాబాద్‌‌ ఏరియా హాస్పిటల్‌‌లో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్‌‌ను ప్రారంభించి తొలి టీకా తీసుకున్నారు. కింగ్ కోఠిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎస్ సోమేశ్‌‌ కుమార్ స్టార్ట్‌‌ చేసి వ్యాక్సిన్ వేయించుకున్నారు. రాష్ట్రంలో 48 ప్రభుత్వ దవాఖాన్లు, 45 ప్రైవేట్ దవాఖాన్లలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. మరో 3 రోజుల పాటు ఈ సెంటర్లలోనే వ్యాక్సిన్‌‌ వేస్తారు. తర్వాత సెంటర్లను పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో కలిపి తొలి రోజు 4,558 మందికి వ్యాక్సిన్ వేశారు.

త్వరలో అన్ని సర్కారు ఆస్పత్రుల్లో

కరోనాకు వ్యాక్సిన్‌‌ శాశ్వత పరిష్కారమని మంత్రి ఈటల చెప్పారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. అపోహలు, భయాలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌‌ఎస్ ఆస్పత్రుల్లో టీకా వేస్తారని చెప్పారు. సర్కారు దవాఖాన్లలో ఫ్రీగా టీకా ఇస్తారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 250కు ఒక డోస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీకా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ప్రజలు తొందరపడవద్దని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు.

వందేళ్ల వృద్ధుడికి వ్యాక్సిన్‌‌

సోమవారం వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లలో 90 శాతం మంది వృద్ధులు, 10 శాతం మంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లు ఉన్నారు. సెక్రటేరియట్ దగ్గర ఉన్న మెడికవర్ హాస్పిటల్‌‌లో వందేళ్ల వృద్ధుడు జయదీప్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.