గోదావరి వరదతో సర్వం కోల్పోయిన బాధితులు

గోదావరి వరదతో సర్వం కోల్పోయిన బాధితులు

భద్రాద్రి కొత్తగూడెం/చర్ల/బూర్గంపహడ్​, వెలుగు :  గోదారి వరదల్లో ఇండ్లు మునిగి సర్వం కోల్పోయిన బాధితులు తల్లడిల్లుతున్నారు. ఇన్నాళ్లూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకోగా వరదలు తగ్గి ఇండ్లకు వెళ్తే తడిసిపోయిన బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు, సామాన్లు కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో రోజులు ఎట్లా ఎల్లదీసుడో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది బురదతో నిండిపోయిన ప్లేట్లు, గిన్నెలు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్​సామాన్లను శుభ్రం చేసుకుని సర్దుకుంటున్నారు. పనికిరాని వాటిని పడేస్తున్నారు. 

తప్పని పరిస్థితుల్లో రూ.50కే డ్రెస్​

మొన్నటి వానలకు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్,​అశ్వాపురం, చర్ల మండలాల్లో ఊర్లన్నీ మునిగిపోయాయి. మెల్లిమెల్లిగా గోదారమ్మ శాంతించగా వరదలో ఉన్న ఇండ్లు, షాపులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఇక బాధలుండవని ఇండ్లకు వెళ్తే  అక్కడి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. చాలా వస్తువులు పనికిరాకుండా పోయాయి. బూర్గంపహాడ్​లో అనంత్​ అనే వ్యాపారి తన బట్టల షాపులోని డ్రెస్సులన్నీ తడిసిపోగా, వాటిని రూ.50 చొప్పున అమ్ముకుంటున్నాడు. పెట్టుబడి రాకపోయినా రోజువారీ ఖర్చులైనా ఎల్తయని ఇట్లా చేస్తున్నట్టు చెప్పాడు. చర్ల, అశ్వాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇండ్లకు ఇండ్లే కొట్టుకుపోవడం, మరికొన్ని కూలడంతో సర్వం కోల్పోయిన బాధితులు తమను ఎవరు ఆదుకుంటారా అని ఎదురుచూస్తున్నారు. తాము ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ‘ఉన్న ఇల్లు కూలిపోయింది. ఇంట్లోని వస్తువులు కొట్టుకుపోయినయ్. మళ్లీ ఎట్లా కొనుక్కోవాలో తెలుస్తలేదు’ అని బతుకమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఇండ్లలో తడిసిన పుస్తకాలు, సర్టిఫికెట్లను ఆరబెట్టుకుంటున్నారు. అధికారులు పారిశుధ్యంపైనే దృష్టి పెడ్తున్నారని, తమను ఆదుకునేందుకు సాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు.  మరో వైపు వరద తగ్గడంతో దెబ్బతిన్న రోడ్లు ఒక్కొక్కటిగా బయట పడ్తున్నాయి. బురదమయమైన మట్టి రోడ్లు ఎండిపోవడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. 

రూ.10 వేల సాయానికి ఇంటింటి సర్వే 

భద్రాచలం :   రూ.10వేల వరద సాయం ఇచ్చేందుకు చేస్తున్న సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కలెక్టర్​అనుదీప్​ రంగంలోకి దిగారు. పక్కాగా ఇంటింటి సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. కలెక్టర్​స్వయంగా టౌన్​లోని వరద బాధిత కాలనీల్లో పర్యటించి సర్వే తీరును పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. ఇంతకుముందు చేసిన సర్వేపై అనుమానాలుంటే రీ సర్వే చేయాలని, తప్పులు సరిదిద్దుకోవాలని బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హుల పేర్లను నమోదు చేయొద్దని సూచించారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నిత్యావసరాలు నాణ్యమైనవే ఇస్తున్నామని, తేడా అనిపిస్తే తిరిగి ఇస్తే రీప్లేస్​చేస్తామన్నారు. సుభాష్​నగర్, అశోక్​నగర్​ కొత్తకాలనీల్లో ముంపు నీటిని సింగరేణి బాహుబలి మోటార్లతో తొలగించాలని ఇరిగేషన్​ ఇంజినీర్లను ఆదేశించారు. ఈ రెండు కాలనీల్లోనూ కలెక్టర్ పర్యటించారు. వీటితో పాటు మిషన్​భగీరథ పథకం కింద సరఫరా చేస్తున్న నీళ్లను ప్రతిరోజూ పరీక్షించాలని ఆదేశించడంతో అధికారులు టెస్టులు మొదలుపెట్టారు.  

రూ. 4.20 లక్షల నష్టం  

గోదావరి వరదల మూలంగా షాపులోని బట్టలన్నీ తడిసి పోయినయ్. రూ. 4.20 లక్షల నష్టం వచ్చింది. కొంతలో కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవాలని, రోజు వారీ ఖర్చులు ఎల్లదీసుకోవాలని తడిసిన డ్రెస్సులను రూ.50కి డ్రెస్​చొప్పున అమ్ముతున్న. కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా వరద పాలైంది. 
–  అనంత్​, వ్యాపారి, బూర్గంపహడ్​ 


కన్నీళ్లే మిగిలాయి 
ఎప్పుడు లేని విధంగా గోదావరికి వరదొచ్చింది. ఇంట్లోని వస్తువులన్నీ గోదావరి ఊడ్చుకుపోయింది. పునరావాస కేంద్రానికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లిన వస్తువులే మిగిలాయి. ఇంటి చుట్టూ గోడలు కూలిపోయాయి. ఎటు పోవాలో తెలియడం లేదు. పునరావాస కేంద్రంలో అన్నం పెట్టారు కానీ ఇప్పుడు ఇంటికి వెళ్లాక ఉండాలంటే ఎట్లా? ఒక్క పైసా ఎవరూ సాయం చేయడం లేదు. ఎట్లా బతకాలి? 
– రూబులమ్మ, వ్యవసాయ కూలీ 

ఇల్లు కూలె..నిలువ నీడ లేకపాయే

పక్క ఫొటోలోని మహిళ పేరు ఉప్పట్ల సమ్మక్క. ఉండేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొంపల్లి. వ్యవసాయ కూలీగా పని చేస్తోంది. ఈమె భర్త, కొడుకుతో పాటు వృద్ధుడైన మామతో కలిసి గుడిసెలో ఉంటున్నారు. వర్షాలు మొదలైనంక గోదావరికి వరద వస్తుందని, పునరావాస కేంద్రానికి రావాలంటూ ఆఫీసర్లు హెచ్చరించడంతో కట్టుబట్టలతో అందరూ కలిసి వెళ్లారు. వరద తగ్గాక వచ్చి చూస్తే గుడిసె మొత్తం కుప్పకూలి కనిపించింది. ఇల్లు మళ్లీ నిర్మించుకోవాలనుకుంటే చేతిలో రూపాయి బిల్ల లేదు. ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. దీంతో ఆ ఇంటి ముందు కూర్చొని దిక్కులు చూస్తోంది. డబుల్​బెడ్​రూం ఇల్లు కట్టివ్వాలని, అప్పటి వరకు తన ఇంటిని రిపేర్​ చేసి ఇవ్వాలని కోరుతోంది.  – ఉప్పట్ల సమ్మక్క, వ్యవసాయ కూలీ, కొంపల్లి, చర్ల మండలం