కరోనాపై పోరుకు రాష్ట్రానికి రూ. 256 కోట్లు

కరోనాపై పోరుకు రాష్ట్రానికి రూ. 256 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణకు రూ.256 కోట్లు సాయం చేసినట్టు కేంద్రం వెల్లడించింది. మొదటి దశలో రూ.181 కోట్లు ఇవ్వగా, రెండో దశలో మరో రూ.75 కోట్లు ఇచ్చింది. మరో రూ.75 కోట్లు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. రాష్ట్రాలకు చేసిన సాయంపై పార్లమెంట్ క్వశ్చన్‌‌ అవర్‌‌‌‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్ రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. డబ్బులతోపాటు రాష్ట్రానికి భారీగా వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లను కేంద్రం అందించింది. రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్లను కేంద్రం ఇవ్వగా.. వీటి ఇన్‌‌స్టాలేషన్ ప్రక్రియను రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇప్పటికీ పూర్తి చేయలేదు.

3 లక్షల టెస్టింగ్ కిట్లు

రాష్ట్రానికి 3,23,207 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లను కేంద్రం అందించింది. శాంపిల్స్‌‌ నుంచి ఆర్‌‌ఎన్‌‌ఏ ఎక్స్‌‌ట్రాక్షన్‌‌ చేయడానికి రూ.84.37 లక్షల విలువైన యంత్రాలు ఇచ్చింది. 13.85 లక్షల మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42.5 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చింది. టెస్టుల్లో జాతీయ సగటు కంటే, తెలంగాణ వెనకబడిందని కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 683 (ప్రతి మిలియన్ జనాభాకు) టెస్టులు చేస్తుంటే, తెలంగాణలో 426 టెస్టులే చేస్తున్నట్టు తెలిపింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌‌ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించామని పేర్కొన్నారు.