వర్షాకాలంలో చూడచక్కని జలపాతాలు​

వర్షాకాలంలో చూడచక్కని జలపాతాలు​

వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువ మంది టూరిస్టులు ఆలోచించేది వాటర్‌‌‌‌ఫాల్స్‌‌ గురించే. వానలు పడటం మొదలైందంటే చాలా జలపాతాలు జలకళ సంతరించుకుంటాయి. కొండలపై పడే నీళ్లు కిందికి చేరి, చిన్న పాయగా మారి, కొంచెం దూరం ప్రవహించి, జలపాతం ద్వారా కిందికి చేరుకుంటాయి. ఇలా జాలువారే జలపాతాల్ని చూడటం మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. ప్రతి జలపాతం చూడదగ్గదే అయినా, కొన్ని మాత్రం మరింత ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి కొన్ని జలపాతాలు ఇవి.

కుంచికల్‌‌ ఫాల్స్‌‌, కర్ణాటక
దేశంలోని అతిపెద్ద వాటర్‌‌‌‌ఫాల్స్‌‌ కుంచికల్‌‌. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో, ఉడుపి సరిహద్దులో ఉంది. వారాహి నది ప్రవాహం వల్ల ఏర్పడే ఈ జలపాతం ఎత్తు 455 మీటర్లు. ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన జలపాతాల్లో ఇది 116వ స్థానంలో ఉంది. జూలై నుంచి సెప్టెంబర్‌‌‌‌ వరకు ఈ జలపాతాన్ని విజిట్‌‌ చేయడం బెస్ట్‌‌. ఈ టైమ్‌‌లోనే ఈ జలపాతం నిండుగా జాలువారుతుంది. ఎత్తునుంచి జారే జలపాతం, చుట్టూ పరుచుకున్న పచ్చదనం, దగ్గర్లోని అటవీప్రాంతం.. పర్యాటకులకు మెమరబుల్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ను అందిస్తుంది. కుంచికల్‌‌ చుట్టుపక్కల మరికొన్ని చిన్న జలపాతాలు కూడా ఉంటాయి. బెంగళూరు, మంగళూరు నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ జలపాతం దగ్గర్లో డ్యామ్‌‌ కడుతున్నారు. అందువల్ల ఇక్కడికి వెళ్లేందుకు స్పెషల్ పాస్‌‌ తీసుకోవాలి.

బరేహిపాని ఫాల్స్‌‌
ఒడిశాలోని మయూర్‌‌‌‌బంజ్‌‌ జిల్లాలో, సిమ్లిపాల్‌‌ నేషనల్‌‌ పార్క్‌‌ పరిధిలో ఉన్న బరేహిపాని ఫాల్స్‌‌ దేశంలో రెండో అతిపెద్ద వాటర్‌‌‌‌ఫాల్స్‌‌. బుద్ధబలంగా నది నుంచి ఏర్పడే ఈ జలపాతం ఎత్తు 399 మీటర్లు. వర్షాకాలం ఈ జలపాతాన్ని చూసేందుకు మంచి టైమ్‌‌. సిమ్లిపాల్‌‌ నేషనల్‌‌ పార్క్‌‌ను విజిట్‌‌ చేసేవాళ్లు బరేహిపాని ఫాల్స్‌‌ను కూడా చూడొచ్చు. అందమైన ఈ జలపాతంతోపాటు దగ్గర్లోనే టైగర్‌‌‌‌ జోన్‌‌ కూడా చూసిరావొచ్చు. అరుదైన వైట్‌‌ టైగర్స్‌‌ కూడా దీని పరిధిలో కనిపిస్తాయి. జలపాతం దగ్గర్లో టూరిస్ట్‌‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఎత్తైన కొండ నుంచి నీళ్లు కిందికి పారుతుంటే, ఆ దృశ్యాన్ని దగ్గరగా చూడటం టూరిస్టులకు మంచి అనుభూతిని అందిస్తుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌‌‌ నుంచి లేదా కోల్‌‌కతా నుంచి ఈ జలపాతానికి చేరుకోవచ్చు. 

నోకలికాయ్‌‌ ఫాల్స్‌‌
మేఘాలయ అంటేనే జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు పేరుపొందింది. మేఘాలయ వెళ్తే చూసి తీరాల్సిన వాటిలో నోకలికాయ్‌‌ ఫాల్స్‌‌ ఒకటి. ఎక్కువ వర్షపాతం కురిసే చిరపుంజికి దగ్గర్లోనే ఉంది ఈ జలపాతం. 335 మీటర్లున్న ఈ జలపాతాన్ని ‘డేంజరస్లీ బ్యూటీఫుల్‌‌’ అని పిలుస్తారు. చుట్టూ పచ్చని అడవి.. మధ్యలో జలపాతాన్ని చూస్తే ‘వావ్‌‌’ అనాల్సిందే. అందమైన ఈ జలపాతాన్ని విజిట్‌‌ చేస్తే, చుట్టుపక్కల ఉన్న మరెన్నో అట్రాక్షన్స్‌‌ కూడా చూడొచ్చు. దగ్గర్లోనే చెట్ల కొమ్మలతో తీర్చిదిద్దిన డబుల్‌‌ డెక్కర్‌‌‌‌ బ్రిడ్జ్‌‌, గుహలు, ఇతర చిన్నచిన్న జలపాతాలు కూడా చూడొచ్చు. 3,4 రోజులపాటు ఎంజాయ్‌‌ చేయదగ్గ టూరిస్ట్‌‌ స్పాట్‌‌ ఇది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌‌ నుంచి చిరపుంజి మీదుగా రెండు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.

దూద్‌‌సాగర్‌‌‌‌ ఫాల్స్‌‌
టూరిస్ట్‌‌లను ఎక్కువగా ఆకర్షించే గోవా లోని అందమైన జలపాతం దూద్‌‌సాగర్‌‌‌‌. దేశంలోని పెద్ద జలపాతాల్లో ఇదీ ఒకటి. మండోవి నది నుంచి ఏర్పడ్డ ఈ జలపాతం ఎత్తు 310 మీటర్లు. ఎత్తైన పర్వతం నుంచి జాలువారే ఈ జలపాతం కింద ఒక చిన్న పూల్‌‌లా అనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన నీళ్లు పర్యాటకుల్ని మైమరపింపజేస్తాయి. ట్రెక్కింగ్‌‌ కూడా చేయొచ్చు. పనాజికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫాల్స్‌‌ చూసేందుకు ఈ సీజన్‌‌ చాలా మంచిది.