భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి బేడా మండపంలో గురువారం ఘనంగా కల్యాణం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, ఆరాధన చేశాక యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, సుముహూర్తం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం సమర్పించాక క్రతువు ముగించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు అనంతరం రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. రామాలయం అనుబంధ దేవాలయం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పురాణ ప్రవచనాన్ని వేదపండితులు సన్యాసిశర్మ చెప్పారు. మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు.
