పశ్చిమబెంగాల్ లో ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం.. దీదీ సర్కార్ ఈ నిర్ణయం వెనుక..? 

పశ్చిమబెంగాల్ లో ‘ది కేరళ స్టోరీ’పై నిషేధం.. దీదీ సర్కార్ ఈ నిర్ణయం వెనుక..? 

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ మూవీని బ్యాన్ చేయాలని దీదీ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకే, హింసాత్మక సంఘటనలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

సోమవారం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. "కాశ్మీర్ ఫైల్స్’’ మూవీ తరహాలో బెంగాల్‌ లోనూ  బీజేపీ నిధులు సమకూరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొద్ది నిమిషాలకే ఈ ప్రకటన వెలువడింది. ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, ఇది వక్రీకరించిన కథ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 

ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే తమిళనాడులో విడుదలైన రెండో రోజే థియేటర్ యాజమాన్యం బ్యాన్ చేసి, షాక్ ఇచ్చింది. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతులు ఏమయ్యారు...? ఎక్కడున్నారనే ఇతి వృత్తంతో దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించారు. 

చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తాం : చిత్ర నిర్మాత

మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్ణయంపై  ‘ది కేరళ స్టోరీ’ మూవీ నిర్మాత విపుల్ షా స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో  ‘ది కేరళ స్టోరీ’ మూవీపై నిషేధం విధిస్తే.. తాము చట్టపరమైన చర్యలకు ముందుకెళ్తామని ప్రకటించారు.