అంత్యక్రియలు ముగిసిన తరువాత తిరిగొచ్చిన మహిళ

అంత్యక్రియలు ముగిసిన తరువాత తిరిగొచ్చిన మహిళ
  • ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు
  • కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఘటన

అమరావతి: చనిపోయిందని అంత్యక్రియలు జరిపిన మహిళ 15 రోజుల తర్వాత తిరిగి రావడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఆమెకు అంత్యక్రియలతోపాటు పెద్దకర్మ కూడా జరిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తిరిగొచ్చిన మహిళను చూసి షాక్ కు గురయ్యారు. చనిపోయిన మహిళ తిరిగొచ్చిందన్న విషయం గ్రామంలోనే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే.. జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ (75) కరోనా సోకడంతో గత నెల 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆమె భర్త గిడ్డయ్య మూడో రోజు ఆస్పత్రికి వెళ్లగా బెడ్ పై ఉండాల్సిన  ముత్యాల గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు మారినట్లుందన్న సమాధానంతో ఆస్పత్రి అంతా వెదికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో మరోసారి సిబ్బందిని ప్రశ్నించగా మార్చురీలో ఉందేమో చూసుకోమని సలహా ఇచ్చారు. మార్చురీలో తన భార్య ముత్యాల గిరిజమ్మను పోలిన మహిళ మృతదేహాన్ని చూసి తన భార్యదేనని చెప్పాడు. దీంతో గత నెల 15వ తేదిన గిరిజమ్మ చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది.గ్రామానికి తిరిగొచ్చిన గిడ్డయ్య  మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 
మరో వారం రోజులకు అంటే మే 23వ తేదీన గిరిజమ్మ, గిడ్డయ్య దంపతుల కుమారుడు రమేష్ కూడా కరోనాతో చనిపోయాడు. అతనికి కూడా అదే రోజు అంత్యక్రియలు జరిపిన కుటుంబ సభ్యులు ఇద్దరికీ కలిపి పెద్ద కర్మ కూడా పూర్తి చేశారు. మరో వైపు ఆస్పత్రిలో చికిత్స పూర్తి కావడం.. కరోనా నెగటివ్ రావడంతో ముత్యాల గిరిజమ్మను డిశ్చార్జ్ చేశారు. దీంతో బుధవారం ఉదయం ఆమె జగ్గయ్యపేటకు తిరిగొచ్చింది. నిన్ననే ఇద్దరికీ పెద్ద కర్మ క్రతువు పూర్తి చేసి వారి జ్ఞాపకాలు నెమరు చేసుకుంటున్న తరుణంలో గిరిజమ్మ ఆటో దిగి ఇంటికి రావడం చూసి షాక్ కు గురయ్యారు. 
ఆమె అనుకుని వేరొక మహిళ శవానికి అంత్యక్రియలు జరపడంతో చనిపోయిన మహిళ ఎవరన్నది విజయవాడ ఆస్పత్రి వర్గాలకు అర్థం కావడం లేదు.