- డ్వాక్రా గ్రూపులకు ఇచ్చి..మా పొట్ట కొట్టొద్దు
- ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కార్మికులు
ఖైరతాబాద్, వెలుగు: డ్వాక్రా గ్రూపులకు స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్బాధ్యతను ఇచ్చి తమకు అన్యాయం చేసిందని ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కుడుతూ జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసిందన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికుల ప్రతినిధులు మాడిశెట్టి లక్ష్మినారాయణ, వరలక్ష్మి మాట్లాడారు.
కొన్నేండ్లుగా రాష్ట్రంలోని 2 లక్షలకు మందికిపైగా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు యూనిఫామ్స్ కుడుతూ జీవనోపాధి పొందుతున్నామన్నారు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను డ్వాక్రా గ్రూపులకు అప్పగిస్తూ జీవో జారీ చేసిందన్నారు. దీంతో తమకు ఉపాధి లేకుండా పోయిందన్నారు.
డ్వాక్రా గ్రూపులకు సరిగా అవగాహన లేకపోవడంతో డీఆర్డీఏ, మెప్మా అధికారులు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు సైతం సమయానికి యూనిఫామ్స్ అప్పగించలేకపోతాయని భావించి తిరిగి కొందరు అధికారులు యూనిఫామ్స్ కుట్టాలని తమను కోరుతున్నారన్నారు. ఈ సమావేశంలో వెంకట్ రెడ్డి, యాదమ్మ, జయంతి పాల్గొన్నారు.
