నూతన సచివాలయ భవనంపై జాతీయ చిహ్నాలు

నూతన సచివాలయ భవనంపై జాతీయ చిహ్నాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ గడువు ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో సిబ్బంది పనులు చేస్తున్నారు. అయితే.. ఈ సచివాలయ నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భవనం పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నారు. భవనం ముందువైపు ఉన్న భారీ గుమ్మటంపై జాతీయ చిహ్నాన్ని అమర్చారు. భారీ క్రేన్ సహాయంతో చిహ్నాన్ని కింది నుంచి గుమ్మటం పైకి తీసుకెళ్లి అమర్చారు. ఐదు టన్నుల బరువు ఉండే ఈ కాంస్య చిహ్నాన్ని ఢిల్లీలో సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. 
 
జాతీయ చిహ్నం ఎత్తు 18 అడుగులు ఉంది. భవనం, గుమ్మటం కలిపి ఇప్పటికే 258 అడుగుల ఎత్తు వచ్చింది. తాజాగా జాతీయ చిహ్నం కూడా ఏర్పాటు చేయడంతో మొత్తం పొడవు 276 అడుగులకు చేరుకుంది. భవనం వెనుక వైపు ఉన్న భారీ గుమ్మటంపై కూడా మరో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు... భవనం లోపల అంతర్గత పనులు కొనసాగుతున్నాయి. అలాగే.. సచివాలయ భవనం చుట్టూ నిర్మిస్తున్న మసీదు, ఆలయం, కాంప్లెక్స్ పనులు కూడా వేగవంతమయ్యాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.