కొత్తగూడెంలో ప్రపంచంలోనే రెండో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ

కొత్తగూడెంలో ప్రపంచంలోనే రెండో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
  • అగ్రికల్చర్​ మినిస్టర్ ​తుమ్మల నాగేశ్వరరావు
  • వచ్చే ఏడాది నుంచి పీహెచ్డీ కోర్సులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఏర్పాటైన డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీ ప్రపంచంలోనే రెండోదని అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్​లోని సచివాలయంలో వర్సిటీ వైస్​ ఛాన్స్లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు.  వర్సిటీ నిర్మాణ పనుల ప్రగతిపై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలి ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీగా పాల్వంచలోని డాక్టర్​ మన్మోహన్​ సింగ్​ ఎర్త్​ సైన్సెస్​ యూనివర్సిటీ నిలుస్తోందన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఆర్కిటెక్ట్​ల ద్వారా భవన నిర్మాణాలకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్​డీ కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు చేపడ్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న మైనింగ్​ యూనివర్శిటీలో అండర్​ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సులు కొనసాగుతున్నాయన్నారు. పీహెచ్​డీ కోర్సులు ప్రారంభించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​తో చర్చించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. సింగరేణి, ఎన్​ఎండీసీ, కోల్​ ఇండియా లాంటి సంస్థల ద్వారా సీఎస్​ఆర్​ ఫండ్స్​ను సేకరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చే వారంలో సీఎం రేవంత్​ రెడ్డిని కలిసి యూనివర్సిటీ నిర్మాణ ప్రణాళిక, నిధుల అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్​ డిజైన్​ ఖర్చు అంచనాలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.