డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకోబోయి పోలీసుని ఢీకొట్టిన యువకుడు

డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పించుకోబోయి పోలీసుని ఢీకొట్టిన యువకుడు

మందుబాబుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు అడ్డొచ్చిన పోలీసులను సైతం గుద్ది పారిపోతున్నారు. ఇటువంటి ఘటనే కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేట్‌లో శనివారం రాత్రి జరిగింది. స్థానిక పోలీసులు శనివారం రాత్రి రాఘవరెడ్డి పంక్షన్ హాల్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో సృజన్ అనే యువకుడు అటుగా వచ్చాడు. పోలీసులు సృజన్‌ను ఆపబోయారు. కానీ సృజన్ మాత్రం తన బైకును ఆపకుండా.. అడ్డుగా ఉన్న హోంగార్డును ఢీకొట్టి పారిపోబోయాడు. కానీ పోలీసులు అప్రమత్తమై పట్టుకున్నారు. సృజన్‌కు ఆల్కహాల్ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది. సృజన్ పారపోయే క్రమంలో రెండు కార్లను కూడా ఢీకొట్టాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అదే సమయంలో అస్లాం అనే మరో వ్యక్తి తన కారుతో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డిని ఢీకొట్టాడు. దాంతో మహిపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రెండు ప్రమాదాలపై కేసు నమోద చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.