
సీఎం కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. కేసీఆర్ ఏ ఒక్కరికి దళిత బంధు ఇవ్వరని .. ఎస్సీ ఉపకులాలకు అసలే ఇవ్వరన్నారు. ఎస్సీ ఉపకులాల వాళ్లు గోల్కోండ వరకు దేకినా కేసీఆర్ దళితబంధు ఇవ్వడన్నారు. కేసీఆర్ వేసిన దళితబంధు ఉచ్చులో ఎస్సీ ఉపకులాలు పడ్డాయని చెప్పారు. ఎస్సీ ఉపకులాలు డిమాండ్ల కోసం అడుక్కోవడం ఆపి అధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక ధర్నాలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఉప కులాలను పట్టించుకోవడం లేదన్నారు.
సిద్దిపేటలో పుట్టిన కేసీఆర్ గజ్వేల్ లో పోటీ చేయడం, హైదరాబాద్ లో పుట్టిన కవిత నిజామాబాద్ లో పోటీ చేయడం సంచారమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంచార జీవులేనని విమర్శించారు. ఈ రాజకీయ నాయకులకు, ఎస్సీ ఉపకులాలకు తేడా లేదన్నారు. ఎస్సీ ఉపకులాలను ఓసీలలో కలపాలని కేసీఆర్ ను డిమాండ్ చేయాలని.. అపుడే ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. వెలమ కులస్థులు ఎప్పుడైనా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బాలసంతల గుడిసెల కంటే...వెలమల ఇల్లే తక్కువ ఉన్నాయన్నారు. ఓటు హక్కు లేకపోతే తమను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదని.. ఓటును అమ్ముకోవద్దని సూచించారు.