- అధికారికంగా ప్రారంభించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
- ఆయన చైర్ పర్సన్‌గా హై లెవల్ కమిటీ
- పాకిస్తాన్ సహా 8 ఇస్లామిక్ దేశాల చేరిక
దావోస్: గాజా వివాదాన్ని పరిష్కరించేందుకు, ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ పేరుతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఈ కమిటీని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అన్ని దేశాలు ఇందులో భాగం కావాలని కోరారు. యునైటెడ్ నేషన్స్‌తో సహా అందరితో కలిసి పనిచేస్తానని తెలిపారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరేందుకు పాకిస్తాన్‌తో సహా 8 అరబ్ దేశాలు అంగీకరించాయి. కమిటీలో సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేసియా, పాకిస్తాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. 8 దేశాల విదేశాంగ మంత్రులు జాయింట్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగస్వాములవుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటించిన ‘20- పాయింట్ గాజా శాంతి ప్రణాళిక’ అమలును ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. కాగా, ఇప్పటివరకు ట్రంప్ 50కిపైగా దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఇందులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలు దేశాల అధినేతలూ ఉన్నారు.
మద్దతు ప్రకటించిన పలు దేశాల అధ్యక్షులు
‘బోర్డ్ ఆఫ్ పీస్’ కమిటీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో, పరాగ్వే అధ్యక్షుడు పెనా, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు మిర్జియోయెవ్, అర్మేనియా పీఎం పాషిన్యాన్, అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ మద్దతు తెలిపారు.
బోర్డు ఏర్పాటుపై పలు దేశాల సంతకాలు
యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజాను తిరిగి నిర్మించడం కోసం అంతర్జాతీయ వనరులను సమీకరించడం, గాజాలో పాలస్తీనా స్వయంపాలన ఏర్పడే వరకు ఒక తాత్కాలిక యంత్రాంగాన్ని పర్యవేక్షించడం ఈ కమిటీ లక్ష్యం. శాశ్వత కాల్పుల విరమణను అమలు చేయడం, హమాస్ నిరాయుధీకరణ వంటి అంశాలపై ‘బోర్డ్ ఆఫ్ పీస్’ కమిటీ దృష్టి పెడ్తుంది. ఈ ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు డొనాల్డ్ ట్రంప్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా ఈ బోర్డు ఏర్పాటుపై అధికారికంగా సంతకాలు జరిగాయి. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ బోర్డులో సభ్యులుగా ఉండేందుకు అంగీకరించారు. అయితే, హమాస్ ఆయుధాలు వీడాలని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇది అద్భుతంగా పని చేస్తది: ట్రంప్
బోర్డ్ ఆఫ్ పీస్ కమిటీని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ‘‘ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. 8 ఇస్లామిక్ దేశాల మద్దతుతో గాజాలో శాంతి సులభమవుతుంది. ఈ బోర్డులో శాశ్వత సభ్యత్వం కావాలనుకునే దేశాలు 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. హమాస్ ఆయుధాలను వదులాలి. గాజాను నిరాయుధీకరణ చేసి, అందంగా పునర్నిర్మించడమే మా లక్ష్యం. గాజాలో కొత్త సీపోర్ట్, ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తాం. ఈ బోర్డును భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఇతర వివాదాల పరిష్కారానికీ విస్తరింపజేస్తాం’’ అని ట్రంప్ ప్రకటించారు. ఇది యునైటెడ్ నేషన్స్ కంటే మెరుగ్గా పని చేస్తుందని, దానికి ప్రత్యామ్నాయంగా మారుతుందని చెప్పారు.
ఎలాంటి నిర్ణయం తీసుకోని ఇండియా
దావోస్‌లో ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ కమిటీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇండియా గైర్హాజరైంది. ప్రధాని మోదీకి ఆహ్వానం అందినప్పటికీ, దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది సున్నితమైన అంశం కావడంతో అన్ని కోణాలను పరిశీలిస్తున్నది. ఇండియా ఎప్పుడూ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలుగా ఉండాలన్నదే భారత్ ప్రతిపాదన. ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, జర్మనీ వంటి ప్రధాన దేశాలు కూడా ఈ సంతకాల కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, పరాగ్వే, రష్యా, స్లోవేనియా, టర్కీ, ఉక్రెయిన్ కూడా నిర్ణయం తీసుకోలేదు. అర్జెంటీనా, ఆర్మేనియా, అజర్‌బైజాన్, బహ్రెయిన్, బెలారస్, ఈజిప్ట్, హంగేరి, కజకిస్తాన్, మొరాకో, పాకిస్తాన్, యూఏఈ, సౌదీ, వియత్నాం మాత్రం సంతకాలు చేశాయి.
