జీహెచ్‌‌‌‌ఎంసీలో 25 డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు : ముషారఫ్‌‌‌‌ ఫారూఖీ

జీహెచ్‌‌‌‌ఎంసీలో 25 డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు : ముషారఫ్‌‌‌‌ ఫారూఖీ
  • ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించాలి: ముషారఫ్‌‌‌‌ ఫారూఖీ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌‌‌‌ఎంసీ) పరిధిలోని 25 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఎస్‌‌‌‌పీడీసీఎల్ చైర్మన్​ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. వచ్చే నెల 1 నుంచి దీనికి సంబంధించి పనులు ప్రారంభించాలన్నారు. గురువారం హైదరాబాద్‌‌‌‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారూఖీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి ఆర్టీసీ చర్యలు చేపడుతోందని చెప్పారు. నేపథ్యంలో బస్సుల చార్జింగ్‌‌‌‌కు అవసరమైన చార్జింగ్ పాయింట్లకు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు కోసం ఆ సంస్థ నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలోని 25 డిపోలు, సూర్యాపేటలో రెండు డిపోలు, సంగారెడ్డి, నల్గొండ డిపోల్లో ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నుంచి అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. వీటి నిర్వహణకు సుమారు 124 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం ఉంటుందన్నారు. ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో భారీ స్థాయిలో ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. చార్జింగ్ స్టేషన్లకు అవసరమైన స్విచ్చింగ్‌‌‌‌ స్టేషన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో స్థలం ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన హామీ ఇచ్చారు.