మనిషి తలరాతను మార్చేది చదువొక్కటే : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

మనిషి తలరాతను మార్చేది చదువొక్కటే : వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • క్రమశిక్షణతో కష్టపడితే లక్ష్యాలు సాధిస్తామని వెల్లడి
  • బాచుపల్లిలోని కేఎల్‌‌‌‌హెచ్‌‌‌‌ వర్సిటీ 
  • క్యాంపస్‌‌‌‌లో స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రారంభోత్సవానికి హాజరు

జీడిమెట్ల, వెలుగు: మనిషి తలరాతను, తరతరాలను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం హైదరాబాద్‌‌‌‌ బాచుపల్లిలోని కేఎల్‌‌‌‌హెచ్‌‌‌‌ వర్సిటీ క్యాంపస్‌‌‌‌లో చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం, యూనివర్సిటీలో రూ.100 కోట్ల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వివేక్‌‌‌‌ హాజరై మాట్లాడారు. మనిషి తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్న విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థి దశలో ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.

చదువుకునే వయసులో కష్టపడటం నేర్చుకోవాలని, ఈ వయసులో కష్టపడితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు. ఓ లక్ష్యంతో ముందుకు సాగాలని కోరారు. మా నాన్న కాకా వెంకటస్వామి తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాలు వద్దనుకున్న తనకు.. తన తండ్రి స్ఫూర్తితోనే పాలిటిక్స్‌‌‌‌లోకి వచ్చానన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌‌‌‌లో చదివి, తర్వాత మెడిసిన్ చేశానని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. 

కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే కచ్చితంగా జీవితంలో ఎదుగుతామన్నారు. తాను తన తండ్రిలాగా మంచి పేరు తెచ్చుకోవాలని క్రమశిక్షణ, పట్టుదలతో 12 రాష్ట్రాల్లో విశాక ఇండస్ట్రీని నెలకొల్పామని, వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. మెరిట్​ విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏటా జాతీయ స్థాయిలో ఎంట్రెన్స్​ టెస్ట్​ నిర్వహిస్తున్నామని కేఎల్​ వర్సిటీ డైరెక్టర్​ జే.శ్రీనివాస రావు తెలిపారు. విద్యతో పాటు అనేక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే స్టూడెంట్లకు 100% స్కాలర్​షిప్​ అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ రూ.100 కోట్ల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్  పోస్టర్ విడుదల చేయడంతో పాటు ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం రవికుమార్​, కేఎల్​హెచ్ బాచుపల్లి క్యాంపస్​ ప్రిన్సిపాల్ రవికుమార్​, గ్లోబల్​ బిజినెస్​ స్కూల్​ డీన్ డాక్టర్​ ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.