దెబ్బకొట్టిన కొత్త లేబర్ కోడ్ లు.. ఇండిగో లాభం 78శాతం డౌన్

దెబ్బకొట్టిన కొత్త లేబర్ కోడ్ లు.. ఇండిగో లాభం 78శాతం డౌన్
  • అంతరాయాలు, కొత్త లేబర్ కోడ్​తో నష్టాలు
  • సర్వీసుల రద్దుల వల్ల రూ.577 కోట్లు లాస్​
  • లేబర్​ కోడ్లతో రూ.969 కోట్ల భారం

న్యూఢిల్లీ: కొత్త కార్మిక చట్టాలు, ఇటీవల విమాన సర్వీసుల నిర్వహణలో ఎదురైన అంతరాయాలు మనదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను దెబ్బకొట్టాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. డిసెంబర్ ముగింపుతో కూడిన ఈ క్వార్టర్‌‌లో కంపెనీ నికర లాభం 78 శాతం తగ్గి రూ.549.1 కోట్లుగా నమోదైంది. 

గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.2,448.8 కోట్ల లాభాన్ని సంపాదించింది.  గత ఏడాది మూడో క్వార్టర్​తో పోలిస్తే లాభం రూ.1,899 కోట్లు తగ్గింది. గత నెల ప్రారంభంలో జరిగిన విమాన సర్వీసుల రద్దుల వల్ల రూ.577.2 కోట్లు నష్టం వాటిల్లింది. కొత్త కార్మిక చట్టాల నిబంధనల అమలు వల్ల మరో రూ.969.3 కోట్ల భారం పడింది. 

విమానాల రద్దుల వ్యవహారంలో డీజీసీఏ రూ.22.2 కోట్ల జరిమానా కూడా విధించింది. డాలర్ రూపంలో చేసే భవిష్యత్తు చెల్లింపుల కారణంగా, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల మరో రూ.1,035 కోట్ల భారం పడింది.

ఆదాయం రూ.24,540.6 కోట్లు

ఇండిగో పేరెంట్​ కంపెనీ ఇంటర్‌‌గ్లోబ్ ఏవియేషన్ మొత్తం ఆదాయం రూ.24,540.6 కోట్లకు చేరింది. గత ఏడాది ఆదాయం రూ.22,992.8 కోట్లతో పోలిస్తే ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల వల్ల లాభం తగ్గింది.  భారీగా సర్వీసులు రద్దు చేసినా, సంస్థ ఆదాయం ఏడు శాతం పెరిగి సుమారు రూ.24 వేల కోట్లకు చేరింది. ఈ క్వార్టర్ లో ఇండిగో విమానాల్లో సుమారు 3.2 కోట్ల మంది ప్రయాణించారు. గత ఏడాది మొత్తం మీద 12.4 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసింది. 

విమానాలను రద్దు చేసినందుకు డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఇండిగో వింటర్ షెడ్యూల్‌‌లో 10 శాతం కోత విధించింది. గత డిసెంబరులో 2,507 విమానాలు రద్దయ్యాయి. మరో 1,852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో సుమారు మూడు లక్షల మంది విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

దీనిపై విచారణ చేపట్టిన డీజీసీఏ ఇండిగోకు రూ.22.20 కోట్లు జరిమానా వేసింది. వచ్చే నెల 10 తర్వాత విమాన సర్వీసుల రద్దు ఉండబోదని కంపెనీ హామీ ఇచ్చింది.