
- దత్తాత్రేయ టెంపుల్హుండీ కొల్లగొట్టిన దొంగ
- ప్రధాన హుండీ తెరవడానికి విఫలయత్నం
- బుధవారం రాత్రి ఘటన
బాసర, వెలుగు : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలోని దత్తాత్రేయ మందిరంలోని హుండీని బుధవారం అర్ధరాత్రి ఓ దొంగ కొల్లగొట్టాడు. రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు ముందుగా అంతరాలయంలోని దత్తాత్రేయ టెంపుల్ హుండీలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. తర్వాత అక్కడే ఉన్న ప్రధాన హుండీని తెరవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఓ బీరువా కనిపించడంతో పగలగొట్టాడు. అందులో చీరలు ఉండగా వాటిని ముట్టుకోలేదు. బయటికి వచ్చిన తర్వాత లడ్డూ, పులిహోర కౌంటర్‌ను ధ్వంసం చేయగా అక్కడేమీ దొరకలేదు. అంతరాలయంలోకి రాత్రి 10.20 గంటలకు చొరబడి11.40 గంటలకు బయటకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు.
గంటకు పైగా దుండగుడు అంతరాలయంలో ఉన్నా అక్కడి హోంగార్డు, సిబ్బంది గుర్తించలేకపోయారు. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది హుండీలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి ఈవో విజయరామారావుతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్‌టీం ఆధారాలు సేకరించాయి. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ వేర్వేరుగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
హోంగార్డులను తొలగించాలి
బాసర అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోంగార్డులను తొలగించాలని గురువారం తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎస్ఐ గణేశ్ వినతిపత్రాలను అందజేశారు.