కేపీహెచ్బీలో వృద్ధ దంపతులను బెదిరించి దోపిడీ... 20 తులాల గోల్డ్, రూ.3 లక్షలు చోరీ

కేపీహెచ్బీలో వృద్ధ దంపతులను బెదిరించి దోపిడీ... 20 తులాల గోల్డ్, రూ.3 లక్షలు చోరీ

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీ ఏడో ఫేజ్​లో సోమవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. డోర్​ లాక్​ పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వృద్ధ దంపతులను కొట్టి, భయపెట్టి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత పక్కింట్లో దోపిడీకి విఫలయత్నం చేశారు. కేపీహెచ్​బీ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీ ఏడో ఫేజ్​లోని ఎంఐజీ 11లో రిటైర్డ్​ తహసీల్దార్​ నాగేశ్వరరావు(90), అతని భార్య సరస్వతి(85) నివసిస్తున్నారు. 

సోమవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు డోర్​ పగులగొట్టి ఇంట్లోకి వచ్చారు. వృద్ధ దంపతులపై దాడి చేసి భయపెట్టారు. సరస్వతి ఒంటి మీద ఉన్న ఆభరణాలు లాక్కున్నారు. బీరువా లాకర్​ తెరిచి మరికొన్ని ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదు దోచుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. డాగ్​ స్క్వాడ్​తో తనిఖీలు చేశారు. దొంగల ఆచూకీ కోసం నాలుగు టీమ్​లు గాలిస్తున్నాయి.