ఆర్మూర్, వెలుగు : ఆలూర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్లెల రాము నవంబర్ 27న కుటుంబీకులతో కలిసి తన మామా దశదిన కర్మకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చి చూడగా మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది.
ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 18 తులాల బంగారు ఆభరణాలు, వెండి నగలు, రూ.లక్ష నగదు చోరీ అయినట్లు గుర్తించి లబోదిబోమన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
