ఏపీ, తెలంగాణ బార్డర్లో చోరీలు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ఏపీ, తెలంగాణ బార్డర్లో చోరీలు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కల్లూరు, వెలుగు: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. కల్లూరు పోలీస్ స్టేషన్‌‌లో ఏసీపీ వసుంధర యాదవ్, సీఐ ముత్తు లింగయ్య, ఎస్సై డి.హరిత  గురువారం కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఎన్టీఆర్​ జిల్లా మైలవరానికి చెందిన బోలుసు ఏసుబాబు, చాట్రాయికి చెందిన చేవూరి ఆదినారాయణ, ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళి పలు చోరీలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా దొంగతనాలు మానలేదు.

రాత్రి పూట బైకులపై తిరుగుతూ తెలంగాణ, ఏపీ సరిహద్దు మండలాల్లో దేవాలయాలను రెక్కీ చేసి, ఎవరూ లేని సమయంలో హుండీలు పగులగొట్టి డబ్బులు దొంగిలిస్తున్నారు. గత ఆరు నెలల్లో కల్లూరు మండలం చెన్నూరు, చిన్న కోరుకొండి, తల్లాడ మండలం వెంకటగిరి, మధిర మండలం మల్లారం, ఏపీలోని విస్సన్నపేట ఆంజనేయస్వామి ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. చెన్నూరులోని కిరాణా దుకాణం, పెనుబల్లిలోని పోస్టాఫీస్‌‌లో కూడా దొంగతనాలు చేశారు.

బుధవారం సాయంత్రం కల్లూరు పట్టణంలోని మధిర రోడ్డు శివారు ప్రాంతంలో ఎస్సై హరిత సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో రెండు బైక్​లపై వస్తున్న ఏసుబాబు, ఆదినారాయణ, తుమ్మల మురళితో పాటు మరో వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని రెండు బైక్​ను, గడ్డపారను స్వాధీనం చేసుకున్నారు.