చత్తీస్‌గఢ్​​లో మీకంటే  మంచి పథకాలున్నయ్

చత్తీస్‌గఢ్​​లో మీకంటే  మంచి పథకాలున్నయ్
  • మంత్రి కేటీఆర్‌‌ కామెంట్లకు పీసీసీ చీఫ్​ రేవంత్ కౌంటర్    
  • అక్కడ వరికి ఎంఎస్పీ కంటే రూ.540 ఎక్కువిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల కన్నా మంచి పథకాలు మిగతా రాష్ట్రాల్లో చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘తెలంగాణ కంటే చత్తీస్‌గఢ్‌ సర్కార్ మంచి స్కీములు అమలు చేస్తున్నది. వరికి ఎంఎస్పీ రూ.1,960 ఉంటే.. అక్కడ రూ.2,500 ఇస్తున్నరు. ప్రత్యామ్నాయ పంటలకు ఎకరాకు రూ.పది వేల ప్రోత్సాహకం కూడా అందిస్తున్నరు. మన రాష్ట్రంలో వరి కుప్పలపై రైతులు గుండె పగిలి చచ్చిపోతున్నరు. ఇంకా మీరు గొప్ప స్కీంలు అమలు చేస్తున్నమని ఎట్ల చెప్పుకుంటున్నరు?” అని ప్రశ్నించారు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం హోటల్​ తాజ్ దక్కన్‌లో సీఎల్పీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న వాటికంటే చత్తీస్‌గఢ్‌ స్కీమ్‌లు గొప్పవేనన్నరు. గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్, డ్రగ్స్ విషయంలో సవాల్ విసిరి పారిపోయారని, ఇప్పుడైనా చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్‌ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్‌‌కు ఆఫర్ ఇచ్చారు.

ప్రభుత్వ తప్పులను ప్రశ్నించొద్దని..
గవర్నర్ ప్రసంగం జరిగితే.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే అవకాశం ఉండేదని రేవంత్ అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం ద్వారా ప్రధాని మోడీ, బీజేపీకి వ్యతిరేకం అని చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ లోటు పాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే ఆలోచనతో టీఆర్ఎస్ సర్కారు ఈ దుర్మార్గమైన ఆలోచన చేసిందని ఆరోపించారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం రాకపోతే.. వీధుల్లో పోరాడుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై జరుగుతున్న రేప్‌లలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటుందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు టీఆర్ఎస్ నేతలే సుపారీ ఇచ్చారని ఆరోపించారు.

డిసెంబర్‌‌లో అసెంబ్లీ రద్దు చేస్తరు
డిసెంబర్‌‌లో రాష్ట్ర అసెంబ్లీ రద్దు అయితదని రేవంత్ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ చివరిదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నెల రోజులు అంతకంటే ఎక్కువ రోజులు జరిగేవని, కాని ఇప్పుడు 8 రోజులకు కుదించారన్నారు. బడ్జెట్ సమావేశాలు కనీసం 21 రోజులు జరిగేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సభలో ఏ మాత్రం అవమానం చేసినా.. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగుతాయని హెచ్చరించారు. సమావేశంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, వీరయ్య, సీతక్క తదితరులు పాల్గొన్నారు.