సెప్టెంబర్​ 17పై పోటాపోటీ.. మూడు పార్టీలు మూడు రకాలుగా వేడుకలు

సెప్టెంబర్​ 17పై పోటాపోటీ.. మూడు పార్టీలు మూడు రకాలుగా వేడుకలు
  • విమోచనం’ అంటున్న బీజేపీ, స్వాతంత్ర్యం’ అంటున్న కాంగ్రెస్​
  • ‘సమైక్యత’ అంటున్న బీఆర్​ఎస్​
  • హైదరాబాద్​లో ఒకే రోజు అమిత్​షా, సోనియా గాంధీ, కేసీఆర్ ​సభలు

హైదరాబాద్, వెలుగు: నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన ‘సెప్టెంబర్​17’పై రాష్ట్రంలో పొలిటికల్​ హీట్​ రాజుకుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్​ఎస్​.. ఒక్కో పేరుతో ఒక్కో రకంగా పోటాపోటీగా ఉత్సవాలు, సభలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్​షా, కాంగ్రెస్​ అగ్రనేత సోనియాగాంధీ, సీఎం కేసీఆర్​అదే రోజు విడివిడిగా సభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా నిరుడు అధికారికంగా సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో విమోచన వేడుకలు జరిపింది. ఇప్పుడు కూడా అక్కడే అదే పేరుతో వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ వేడుకలకు అమిత్​షా హాజరుకానున్నారు. అదేవిధంగా ఈసారి ఫస్ట్​ టైమ్​ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో కూడా వేడుకలు జరుగనున్నాయి. కాంగ్రెస్​ పార్టీ ‘తెలంగాణ స్వాతంత్ర్య 
దినోత్సవం’ పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16, 17 తేదీల్లో  హైదరాబాద్​వేదికగా కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ.. సోనియాగాంధీ నేతృత్వంలో తుక్కుగూడలో ఈ నెల 17న భారీ బహిరంగ సభ జరుపనుంది. 


 ఇక, నిరుటి తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం.. సెప్టెంబర్​17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆదివారం ప్రకటించింది. పార్టీ పరంగానూ ఈ వేడుకలు నిర్వహించాలని నాయకులకు బీఆర్​ఎస్​ పిలుపునిచ్చింది.  రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు ఉండటంతో సెప్టెంబర్​ 17 వేడుకలను అట్టహాసంగా నిర్వహించే ప్రయత్నాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. 

కమ్యూనిస్టు పార్టీలు కూడా.. 

సీపీఎం ఈ నెల పదో తేదీ నుంచి 17 వరకు వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్​లో చాకలి ఐలమ్మ వర్ధంతి సభ జరిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ పొలిట్​బ్యూరో మెంబర్​ బృందా కరత్​హాజరయ్యారు. సీపీఐ ఈ నెల 11 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నది. 17న హైదరాబాద్​లో భారీ బహిరంగ సభ జరుపనుంది. 

జాతీయ సమైక్యత దినోత్సవంజరుపుతం: కేటీఆర్

భారత సమాఖ్యలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్​ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రజలకు, బీఆర్​ఎస్​ కేడర్​కు మంత్రి కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటనలో​పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్​హైదరాబాద్​లో వేడుకల్లో పాల్గొంటారని, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ముఖ్యులు జాతీయ జెండా ఎగురవేస్తారని ఆయన తెలిపారు. ‘‘జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే ఈ సందర్భాన్ని వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని విచ్ఛిన్నకర శక్తులు ఎత్తుగడలు వేస్తున్నయ్​.  ఆనాటి చరిత్ర, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నయ్​” అని కేటీఆర్​ దుయ్యబట్టారు.  

నిరుటి లెక్కనే సీఎంకు కేంద్రం ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్​ పరేడ్​గ్రౌండ్ లో ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుగనుంది. దీనికి నిరుటి మాదిరిగానే సీఎం కేసీఆర్​కు ఆహ్వానం పంపనున్నట్లు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ప్రకటించారు. పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న వేడుక ఇది అని, అందరూ హాజరుకావాలని ఆయన కోరారు. ‘‘నిజాం ఏలుబడిలోని హైదరాబాద్​స్టేట్​లో అంతర్భాగంగా ఉండి ఇప్పుడు మహారాష్ట్ర, కర్నాటకలో విలీనమైన ప్రాంతాల్లోనూ విమోచన దినోత్సవం నిర్వహిస్తం. హైదరాబాద్​లో నిర్వహించే వేడుకలకు ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరిస్తరు” అని కిషన్​రెడ్డి చెప్పారు.

ఐదు గ్యారంటీలు ప్రకటించనున్న సోనియా

ఈ నెల 16, 17 తేదీలో హైదరాబాద్​లో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరుగనున్నాయి. సెప్టెంబర్​17ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్​ ఏర్పాట్లు చేస్తున్నది. అదే రోజు తుక్కుగూడలో భారీ సభ జరుపనుంది. ఇదే సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలకు సోనియాగాంధీ కాంగ్రెస్​పార్టీ తరఫున ఐదు గ్యారంటీలను ప్రకటించనున్నారు.

హైదరాబాద్​లో ఆదివారం సాయంత్రం వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బు పట్టి ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. రెండు గంటల పాటు వాన పడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెయిన్ రోడ్లు మొదలుకొని కాలనీల రోడ్లపై అంతా 
నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులుపడ్డారు.