ఇరిగేషన్కు రూ.29 వేల కోట్లు!...బడ్జెట్లో ఈ ఏడాది పెరగనున్న కేటాయింపులు

ఇరిగేషన్కు రూ.29 వేల కోట్లు!...బడ్జెట్లో ఈ ఏడాది పెరగనున్న కేటాయింపులు
  •     భూసేకరణకు రూ.5 వేల కోట్లు కేటాయించే చాన్స్
  •     అప్పులకే రూ.12 వేల కోట్ల దాకా అలకేషన్లు 

హైదరాబాద్​, వెలుగు: ఇరిగేషన్​ శాఖకు ఈ ఏడాది బడ్జెట్​లో కేటాయింపులు పెరిగే అవకాశాలున్నాయి. పలు ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో పెట్టుకుని వాటిని పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నది. అయితే, ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు భూసేకరణే సమస్యగా మారడంతో.. దానిపైనే ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. అందులో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్​ కేటాయింపుల్లో భూసేకరణకూ నిధులను కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ ఏడాది బడ్జెట్​లో ఇరిగేషన్​ శాఖకు రూ.29 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉంటాయని తెలిసింది. 

ఎప్పట్లాగే అందులో కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు చెల్లించాల్సిన రుణాల కేటాయింపులకే రూ.12 వేల కోట్ల దాకా పోతాయని సమాచారం. మిగతా మొత్తంలో మరో రూ.12 వేల కోట్లు ప్రాజెక్టుల పనులు, బిల్లుల చెల్లింపులు ఇతరత్రా అంశాలకు కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఇక, ఇప్పటికే సీఎం రేవంత్​ హామీ ఇచ్చిన మేరకు.. భూసేకరణకు రూ.5 వేల కోట్ల కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు. 

15 వేల ఎకరాల దాకా అవసరం

ప్రస్తుతం ప్రభుత్వం ప్రాధాన్య జాబితాలో పలు ప్రాజెక్టులను పెట్టుకుంది. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఐదున్నర లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ఆయా ప్రాజెక్టులకైనా 12 వేల నుంచి 15 వేల ఎకరాల దాకా భూములు, రూ.5 వేల కోట్లకుపైగానే నిధులు అవసరమవుతాయని సమాచారం. ఇక, ఈ భూసేకరణకు సంబంధించి ప్రాధాన్య జాబితాలో పెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకే ఎక్కువ భూములు అవసరం పడనున్నాయి. ఆ ప్రాజెక్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం ఇంకా పూర్తవ్వాల్సి ఉన్నది. 

దీంతో మరో 6 వేల ఎకరాలు ఆ ప్రాజెక్టుకు అవసరమని అధికారులు చెబుతున్నారు. దేవాదుల లిఫ్ట్​కు 3 వేల ఎకరాలు, సీతమ్మసాగర్​కు 2 వేలు, చిన్న కాళేశ్వరానికి 1200, డిండికి 1200, భీమాకు 800, నెట్టెంపాడుకు 300 నుంచి 500 ఎకరాల మధ్యన అవసరమవుతాయని అంటున్నారు. అయితే, వీటిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​, దేవాదుల లిఫ్ట్​కు సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగ్​లో ఉండడమూ భూసేకరణ ఆలస్యమవుతున్నది.