ప్రచారానికి ఇక ఎనిమిది రోజులే.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్న 3పార్టీల ముఖ్య నేతలు

ప్రచారానికి ఇక ఎనిమిది రోజులే.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్న 3పార్టీల ముఖ్య నేతలు
  • ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచారం
  • కాంగ్రెస్​ తరఫున రాహుల్, ప్రియాంక క్యాంపెయినింగ్
  • ఇప్పటికే 64 సభల్లో పాల్గొన్న కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​జరగనుంది. 8 రోజుల్లో (ఈ నెల 25న సాయంత్రం 5 గంటలకు) ప్రచారం గడువు ముగియనుంది. పోలింగ్ ​తేదీ దగ్గర పడుతుండడంతో మూడు ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి.  తమ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చుతున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో ప్రచారానికి రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ ​షాతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్​ ముఖ్య నేతలు రాహుల్ ​గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​చీఫ్​ మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్​అభ్యర్థుల తరపున ఆ పార్టీ చీఫ్ కేసీఆర్​ ఇప్పటికే 64 ప్రచార సభల్లో పాల్గొన్నారు. ప్రచారం గడువు ముగిసే నాటికి ఆయన 94 సభలతో అన్ని నియోజకవర్గాలను కవర్​ చేయనున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​ తాను పోటీ చేస్తున్న సిర్పూర్​తో పాటు ఆ పార్టీ అభ్యర్థుల కోసం పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం హెలిక్యాప్టర్​ను హైర్​ చేసుకున్నారు. ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్​ షోలు, బహిరంగ సభలు, డోర్​టు డోర్​ క్యాంపెయినింగ్​తో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు రోజులు ప్రధాని రోడ్​ షోలు

ప్రధాని మోదీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రానికి వచ్చారు. బీసీల ఆత్మగౌరవ సభ, అణగారిన వర్గాల విశ్వరూప మహాసభల్లో పాల్గొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో మళ్లీ రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్​లో రోడ్​షోలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్​షా, యూపీ, అస్సాం సీఎం యోగి ఆదిత్యనాథ్​, హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నితిన్​గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ ​గోయల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, హుజూరాబాద్​ఎమ్మెల్యే ఈటల రాజేందర్​రాష్ట్రమంతా తిరుగుతూ ఆ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే రాహుల్ ​మకాం..

కాంగ్రెస్​అగ్రనేత సోనియా గాంధీ తుక్కుగూడ బహిరంగ సభలో 6 గ్యారంటీలను ప్రకటించారు. తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా పలువురు ​ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక ఆదివారం పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రాహుల్​గాంధీ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో ప్రచారం చేశారు. రెండు మూడు రోజుల్లో మళ్లీ రాష్ట్రానికి వచ్చి ఈ నెల 28 వరకు ఇక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. త్వరలో హిమాచల్​ప్రదేశ్ ​సీఎం సుఖ్విందర్ ​సుక్కు, రాజస్థాన్​సీఎం అశోక్ ​గెహ్లాట్​ సహా ఇంకొందరు నాయకులు రాష్ట్రంలో ప్రచారానికి వస్తారని రాష్ట్ర కాంగ్రెస్ ​నేతలు చెప్తున్నారు. మరో పక్క పీసీసీ చీఫ్ ​రేవంత్​రెడ్డి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు తాము పోటీ చేసే స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

28న గజ్వేల్​ సభతో కేసీఆర్ ప్రచారం ముగింపు

బీఆర్ఎస్ నేతలు ​3 నెలలుగా ఫీల్డ్​లోనే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ చీఫ్ ​కేసీఆర్ ​అక్టోబర్​15న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి.. ఆదివారానికి 64  ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈనెల 28న సాయంత్రం.. తాను పోటీ చేస్తున్న గజ్వేల్​ నియోజకవర్గ సభతో ఆయన ప్రచారాన్ని ముగించనున్నారు. కేటీఆర్, హరీశ్​రావు రాష్ట్రమంతా చుట్టేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.