
హెచ్ఎండీఏలో హెరిటేజ్ చట్టం ఉన్నట్టే: హైకోర్టు
ఎర్రమంజిల్‌ను కూల్చివేయొద్దన్న పిటిషన్లపై విచారణ
పిటిషనర్ల అభ్యంతరాలపై జవాబివ్వాలని సర్కారుకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హెరిటేజ్ బిల్డింగ్ లను రక్షించేందుకు ప్రభుత్వం చట్టం చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. న్యాయ సమీక్ష చేసి లోపాలు లేకుండా చట్టం రూపొందించాలని, కానీ ఈ చట్టంలో ఒక పేరాలో ఒక తీరుగా, మరో పేరాలో ఇంకో తీరుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ కూల్చివేత నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిల్స్ పై మంగళవారం సీజే జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ‘‘హెచ్‌ఎండీఎ పరిధిలోనే హెరిటేజ్ బిల్డింగ్ యాక్ట్ ఉందని, రాష్ట్రమంతటా చట్టం లేదని.. అందుకే వారసత్వ కట్టడ రక్షణ చట్టం–2017 తెస్తున్నామని ఆ చట్టంలో ఉంది. ఇలా చెప్పడాన్ని బట్టి హెచ్ఎండీఎలో హెరిటేజ్ చట్టం ఉన్నట్టే అవుతుంది కదా..’’ అని బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై సర్కారు తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు వాదనలు వినిపించారు.
‘‘హుడా చట్టం–1995 ప్రకారం ఎర్రమంజిల్ హెరిటేజ్ బిల్డింగ్‌గానే ఉండేది. ఆ యాక్ట్‌లోని సెక్షన్–13ను నాలుగేండ్ల కింద సర్కారు రద్దు చేసింది. కొత్త చట్టం వచ్చాక పాత చట్టం అమల్లో ఉండదు..” అని విన్నవించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. హుడా యాక్ట్ ప్రకారం రద్దు చేసినా, హెచ్ఎండీఎలో రద్దు చేయలేదని, దీనిపైనే పిటిషనర్లు అభ్యంతరం చెబుతున్నారని స్పష్టం చేసింది. ఒక చట్ట నిబంధనను రద్దు చేసినప్పుడు, ఆ నిబంధన ఎక్కడెక్కడ అమలవుతుందో అన్ని చోట్లా రద్దు చేస్తున్నట్టు కొత్త ఉత్తర్వుల్లో ఉండాలి కదా అని ప్రశ్నించింది. పిటిషనర్లు లేవనెత్తే అభ్యంతరాలపై జవాబు చెప్పాలని ఆదేశిస్తూ.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.