టీఆర్ఎస్​లో ఎమ్మెల్సీ రేస్!

టీఆర్ఎస్​లో ఎమ్మెల్సీ రేస్!
  • త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ సీట్లు
  • ఇంతకుముందే ఒక స్థానం ఖాళీ.. మూడూ గవర్నర్​ కోటా లోనివే..
  • మళ్లీ చాన్స్ కోసం ట్రై చేస్తున్న  నాయిని, కర్నె ప్రభాకర్
  • తమకు చాన్స్​ ఇవ్వాలంటూ కొందరు సీనియర్లు, జూనియర్ల లాబీయింగ్
  • సీఎం కేసీఆర్​ దృష్టిలో పడేందుకు అందరి ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగుటీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవుల పందేరం మొదలైంది. ఎలాగైనా ఎమ్మెల్సీ చాన్స్​ కొట్టేసేందుకు కొందరు లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్  నజర్​లో పడేందుకు కష్టపడుతున్నారు. ఆయనకు దగ్గరగా ఉండేవారితో లాబీయింగ్​ చేయించుకునే పనిలో పడ్డారు. మొత్తంగా మరో చాన్స్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తుండగా.. వారికి దీటుగా పార్టీలోని కొందరు సీనియర్లు, జూనియర్లు కూడా లాబీయింగ్  చేస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ఈ నెల 17న, కర్నె ప్రభాకర్ పదవీకాలం ఆగస్టులో ముగుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో ఇప్పటికే రాములు నాయక్ సీటు ఖాళీగా ఉంది. ఈ మూడు ఎమ్మెల్సీ సీట్ల కోసం పార్టీ లీడర్ల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

పోటీలో సీనియర్లెందరో..

గవర్నర్  కోటాలోని ఎమ్మెల్సీ సీట్లపై పార్టీలోని పెద్ద లీడర్లు నజర్ పెట్టారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ లిస్టులో ఉన్నారు.

‘నాయక్’  సీటు లంబాడీలకిస్తరా?

రాములు నాయక్ పై వేటుతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును తిరిగి తమ వర్గానికే ఇవ్వాలని టీఆర్ఎస్​లోని లంబాడీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2019 ఎలక్షన్‌‌‌‌లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సీతారాం నాయక్ కు మహబూబాబాద్ టికెట్ ఇవ్వలేదు. దానికి ప్రతిగా రాజ్యసభ సీటు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎమ్మెల్సీ సీటు ఇస్తానని సీఎం కేసీఆర్​ నుంచి హామీ వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనకు చాన్స్​ ఇస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది.

నాయిని భవిష్యత్ ఏంటి?

సిట్టింగ్​ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిస్థితి ఏమిటని టీఆర్ఎస్​లో చర్చ జరుగుతోంది. తొలి ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన నాయినికి.. మలి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. దాంతో తీవ్రంగా మనస్తాపం చెందారు. కేసీఆర్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల వల్లే తనకు కేబినెట్  చాన్స్ దక్కలేదంటూ.. పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిపై ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్​ నాయినిని ప్రగతిభవన్ కు పిలిచి భవిష్యత్ పై భరోసా ఇచ్చినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, తిరిగి కేబినెట్‌‌‌‌లోకి తీసుకుంటానని నాయినికి హామీ ఇచ్చారని అంటున్నారు. అందుకే నాయిని మంత్రి పదవి లేకున్నా ఇంకా మినిస్టర్ క్వార్టర్స్ లోనే ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా కేసీఆర్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడ సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు నాయిని ప్రయత్నించారని పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కర్నె ప్రభాకర్ కు అసెంబ్లీ సీటు ఇవ్వడం కష్టంగా ఉందని, అందువల్ల ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పదవి దక్కే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు.

తెలంగాణలో 3020కి చేరిన కరోనా కేసులు