టిమ్స్‌‌లో ఉద్యోగాలకు డాక్టర్లు వస్తలేరు

టిమ్స్‌‌లో ఉద్యోగాలకు  డాక్టర్లు వస్తలేరు

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్ర సర్కారు హడావుడిగా ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్‌‌ కు డాక్టర్లు దొరుకుతలేరు. కాంట్రాక్టు రిక్రూట్‌‌ మెంట్‌‌కే సర్కారు మొగ్గుచూపడం, తక్కువ వేతనాలు ఇస్తుండటంతో అందులో పనిచేసేందుకు డాక్టర్లు ఇంట్రెస్ట్​ చూపడం లేదు. కరోనా టైంలో కేవలం ఒక్క ఏడాది కోసం రిస్కు చేయడం ఎందుకని ముందుకు రావడం లేదు. దీంతో సగం పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాగైతే టిమ్స్​లో ట్రీట్​మెంట్లు ఎప్పుడు మొదలవుతయోనన్న విమర్శలు వస్తున్నాయి.

డాక్టర్ల కోసం వెతుకులాట

టిమ్స్‌‌లో 499 పోస్టుల భర్తీకి గత నెల 16న నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులో 14 ప్రొఫెసర్, 24 అసోసియేట్ ప్రొఫెసర్, 48 అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌‌‌, 8 సివిల్ అసిస్టెంట్‌‌ సర్జన్‌‌ (ఆర్‌‌‌‌ఎంవో), 121 మెడికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. మిగతావి నర్సింగ్, ఇతర పోస్టులు. గత నెల 16 నుంచి 19 వరకు అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ నెల 27న హెల్త్ మినిస్టర్‌‌‌‌ ఈటల రాజేందర్ విడుదల చేసిన ఓ ప్రకటనలో టిమ్స్‌‌లో నియామక ప్రక్రియ పూర్తయిందని.. 13 వేల అప్లికేషన్ల నుంచి 499 మందిని ఎంపిక చేశామని పేర్కొన్నారు. తర్వాతి రోజు నుంచే అంతా డ్యూటీలో చేరుతారన్నారు. కానీ టిమ్స్​లో సగం డాక్టర్​ పోస్టులు కూడా భర్తీకాలేదని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌ రమేశ్‌‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నర్సింగ్, ఇతర పోస్టులకు అప్లికేషన్లు బాగానే వచ్చినా డాక్టర్లు ముందుకురాలేదని తెలిసింది. 215 మంది డాక్టర్లు కావాల్సి ఉంటే.. 120 మంది కూడా రాలేదని సమాచారం. దీంతో  డాక్టర్లు కావాలంటూ హెల్త్​ డిపార్ట్​మెంట్​ మళ్లీ వెతుకులాటలో పడింది. ప్రొఫెసర్‌‌‌‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ వంటి అన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ డాక్టర్లను సంప్రదిస్తోంది. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తోంది.

ఎందుకీ పరిస్థితి?

ప్రభుత్వం ఆఫర్ చేసిన జీతం తక్కువగా ఉండడం, ఉద్యోగ భద్రతలేని కాంట్రాక్ట్ రిక్రూట్‌‌మెంట్ కావడం వల్లే ఎవరూ ఆసక్తి చూపడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. వాస్తవానికి ఇంతకుముందు ఎంబీబీఎస్‌‌ డాక్టర్లకు ఇంతగా డిమాండ్ లేదు. కరోనా ఎఫెక్ట్‌‌తో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రైవేటు హాస్పిటల్స్‌‌లోనూ ఎంబీబీఎస్ డాక్టర్లకు నెలకు రూ.60వేల జీతం ఇస్తున్నారు. ఎక్స్‌‌పీరియన్స్‌‌  ఉంటే నెలకు రూ.లక్ష చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిమ్స్‌‌లో మెడికల్ ఆఫీసర్లు, ఆర్‌‌‌‌ఎంవోలకు నెలకు రూ.40,270 మాత్రమే చెల్లిస్తామనడం, అది ఏడాది టెంపరరీ కావడంతో డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. అసిస్టెంట్, అసోసియేట్‌‌, ప్రొఫెసర్ పోస్టులకు నెలకు లక్షా 25 వేల నుంచి లక్షా 90 వేల వరకు జీతమిస్తామన్నా.. ఒక్క ఏడాది జాబ్​ అవడంతో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు.

నాలుగు నెలల నుంచి తిప్పలే..

రాష్ట్రంలో కరోనా కేసులు మొదలైన కొత్తలో సర్కారు టిమ్స్ పేరిట హడావుడి మొదలుపెట్టింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ బిల్డింగ్​ను తీసుకుంది. రూ.25 కోట్లు పెట్టి బెడ్లు, ఇతర సామాగ్రి కొనుగోలు చేసింది. అవసరమైన మార్పులు కూడా చేయించి, పది రోజుల్లో చైనా తరహాలో హాస్పిటల్‌‌ రెడీ చేశామంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. కానీ నాలుగు నెలల నుంచి ఎక్కడిదక్కడే ఉంది. ఒక్క కరోనా పేషెంట్‌‌కు కూడా టిమ్స్‌‌లో ట్రీట్​మెంట్​ ఇవ్వలేదు. వాస్తవానికి మొదట ఇతర దవాఖాన్లలో పనిచేస్తున్న వాళ్లనే టిమ్స్‌‌కు డిప్యూట్ చేసి వాడుకోవాలనుకున్నారు. కానీ అసలే అన్నిచోట్ల తీవ్రంగా కొరత ఉండటంతో అది సాధ్యం కాలేదు.

ఒక్క ఏడాదే అంటే ఎందుకొస్తరు?

టిమ్స్‌‌ ను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశముంటే రెగ్యులర్‌‌‌‌ రిక్రూట్‌‌మెంట్ చేయొచ్చు కదా. ఇలా‌‌ టెంపరరీ రిక్రూట్‌‌మెంట్లు ఇంకెన్నాళ్లు చేస్తరు? ఒక్క ఏడాది ఉద్యోగం కోసం డాక్టర్లు లైఫ్ రిస్క్ చేసి ఎట్లొస్తరు. ప్రొఫెసర్‌‌‌‌ కావాలంటే కనీసం ఏడేండ్ల ఎక్స్‌‌ పీరియన్స్‌‌ కావాలె. ఈ ఏడేండ్లలో వాళ్లు ఎక్కడో సెటిల్ అయి ఉంటరు. అలాంటి వాళ్లు ఒక ఏడాది ఉద్యోగం కోసం అన్నీ వదులుకొని ఎందుకొస్తరు? అది కూడా కరోనా టైంలో వచ్చి ఎందుకు లైఫ్‌‌ రిస్క్ చేస్తరు? ఇవన్నీ గవర్నమెంట్‌‌ కు తెలియదా? ఏపీలో వేల పోస్టులను రెగ్యులర్  బేసిస్‌‌పై రిక్రూట్ చేస్తున్నరు. మన దగ్గర ఎందుకు చేస్తలేరు?

– డాక్టర్ విజయేందర్‌‌‌‌, తెలంగాణ డాక్టర్స్‌‌ ఫెడరేషన్‌‌ కన్వీనర్‌‌

హాస్పిటల్స్ లో చేరిన పేదోళ్లకు సీఎంవో సాయం అందట్లే

 

.