విజయానికి షార్ట్ కట్స్ లేవు.. ఓయూ 83వ స్నాతకోత్సవంలో గవర్నర్

విజయానికి షార్ట్ కట్స్ లేవు.. ఓయూ 83వ స్నాతకోత్సవంలో గవర్నర్
  • 1,024 మందికి పీహెచ్​డీ పట్టాలు ప్రదానం

ఓయూ, వెలుగు: జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, వాటిని అధిగమించినప్పుడే అద్భుతాలు చేయొచ్చని గవర్నర్ తమిళిసై అన్నారు. విజయానికి ఎలాంటి షార్ట్​కట్స్ లేవని, శ్రమ.. పట్టుదలతోనే విజయతీరాలకు చేరుకోవాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవ కార్యక్రమం మంగళవారం వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగింది. ఓయూ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 1,024 మంది స్టూడెంట్స్ పీహెచ్​డీ పట్టాలు పొందారు. ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 58 మంది స్టూడెంట్స్ గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. స్టూడెంట్ల జీవితాలకు ఉపాధ్యాయులే దిక్సూచిగా నిలుస్తారని అన్నారు. ఎలాంటి సందర్భంలో కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. చీఫ్ గెస్ట్​గా హాజరైన ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్, అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ మాట్లాడుతూ.. ఓయూలో చదువుకుని ప్రపంచ అగ్రగామి సంస్థకు నాయకత్వం వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం పీహెచ్​డీ పూర్తి చేసిన 1,024 మంది స్టూడెంట్స్​కు పట్టాలు అందజేశారు. .

గువ్వల బాలరాజుకు పీహెచ్​డీ పట్టా

అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు న్యాయ శాస్ర్తంలో పీహెచ్​డీ పట్టా అందుకున్నారు. గువ్వలకు.. అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ పీహెచ్​డీ పట్టా అందజేశారు. అదేవిధంగా, ఎమ్మెస్సీలో టాపర్‌‌గా నిలిచిన విష్ణు వచన మురపాక గోల్డ్ మెడల్ అందుకున్నది. స్పాన్సర్స్ లేరన్న కారణంతో గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఓయూ అధికారులు నిరాకరించారు. ఈ విషయాన్ని విష్ణు వచన.. గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లింది. గవర్నర్ విజ్ఞప్తి మేరకు ఆమెకు స్పాన్సర్ చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ముందుకు వచ్చారు. చివరికి మంగళవారం అందరితో పాటు విష్ణు వచన కూడా గోల్డ్ మెడల్ అందుకున్నది.