- ఏటేటా పెరుగుతున్న‘జీరో’ స్కూళ్ల సంఖ్య
- నాలుగేండ్ల కింద 122.. ఇప్పుడు 916
- 3,467 స్కూళ్లలో 15 మంది లోపే స్టూడెంట్స్
- 15,535 బడుల్లో కూడా వంద మంది కన్నా తక్కువ
- పెద్దగా ఫలితాలు ఇవ్వని బడిబాట ప్రోగ్రామ్
- 22 స్కూళ్లలో మాత్రం వెయ్యి మందికిపైగా పిల్లలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక్క స్టూడెంట్ కూడా లేని బడుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. నాలుగేండ్ల కింద122 స్కూళ్లుంటే.. ఈసారి ఆ సంఖ్య 916కు చేరింది. పది మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లను పక్క స్కూళ్లలో విలీనం చేయడంతోనే.. ఇలా పిల్లల్లేని బడుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్తున్నారు. వేసవి తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభించే సమయంలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని సరైన ప్రణాళికతో చేపట్టకపోవడంతో స్టూడెంట్ల ఎన్‌రోల్‌మెంట్ పెరగలేదని అంటున్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే..
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2019–20 విద్యాసంవత్సరంలో మొత్తం 25,131 సర్కారీ స్కూళ్లు ఉన్నాయి. అందులో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 20,496 ఉండగా, హైస్కూళ్లు 4,635 ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి సుమారు 25 లక్షల మంది చదువుతున్నారు. ఆయా బడుల వివరాలు, అధికారిక లెక్కల ప్రకారమే జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు 916 ఉన్నాయి. ఇందులో దాదాపు 300 వరకు బడులు ట్రైబల్ ఏజెన్సీ ఏరియాల్లోనివేనని సమాచారం.
నల్గొండలో ఎక్కువ
జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లు అత్యధికంగా నల్లగొండలో 127 ఉండగా, అతితక్కువగా జోగులాంబ గద్వాలలో రెండు స్కూళ్లున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 97, జనగాంలో 42, నాగర్ కర్నూల్‌లో 38, రంగారెడ్డిలో 34 స్కూళ్లలో ఒక్క స్టూడెంట్ కూడా లేరు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే దాదాపు అన్ని జిల్లాల్లో పది మందిలోపే స్టూడెంట్లున్న బడులను అనధికారికంగా మూసివేశారు. వాటిలో చదువుతున్న స్టూడెంట్స్‌ను, టీచర్లను సమీపంలోని స్కూళ్లలో అడ్జెస్ట్‌మెంట్ చేశారు. దాంతో పిల్లల్లేని స్కూళ్ల సంఖ్య పెరిగిందని అంటున్నారు. అయితే ఈ లెక్కలు కూడా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తీసుకున్నవేనని.. ఇప్పుడా జీరో స్కూళ్ల సంఖ్య మరింత భారీగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా గిరిజన తండాలు, దళిత వాడల్లోని స్కూ్ళ్లలో ఈ పరిస్థితి ఉందని అంటున్నారు.
సగానికిపైగా స్కూళ్లలో వంద మందే..
రాష్ట్రంలో 15 మంది లోపు స్టూడెంట్స్ ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు 3,467 ఉన్నాయి. వీటిలో అప్పర్ ప్రైమరీ, ప్రైమరీ స్థాయిలో 3,445 స్కూళ్లుండగా, 22 హైస్కూళ్లున్నాయి. ఇక 16 మంది నుంచి 100 మందిలోపు స్టూడెంట్స్ ఉన్న ప్రైమరీ, యూపీఎస్‌ల సంఖ్య 14,138 కాగా.. హైస్కూళ్లు 1,397 ఉన్నాయి. 2,675 పీఎస్, యూపీఎస్‌లు, 1,985 హైస్కూళ్లలో 250 మంది వరకు స్టూడెంట్స్ ఉన్నారు. 237 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో 1,210 హైస్కూళ్లలో 250 నుంచి వెయ్యి మంది వరకు చదువుకుంటున్నారు. 21 హైస్కూళ్లు, ఒక యూపీఎస్‌లో వెయ్యికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా వెయ్యికిపైగా స్టూడెంట్స్ ఉన్న బడులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఐదు, జోగులాంబ 3, హైదరాబాద్ 3, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో రెండేసి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటింది. 22 జిల్లాల్లో వెయ్యి మంది స్టూడెంట్స్ దాటిన స్కూల్ ఒక్కటి కూడా లేదు.
- రాష్ట్రంలోని మొత్తం స్కూళ్లు 25,131
- మొత్తంగా పిల్లల్లేని స్కూళ్లు 916
- ఇందులో నల్గొండ జిల్లాలో నే 127
- 15 మంది కన్నా తక్కువ ఉన్నస్కూళ్లు 3,467
