స్టూడెంట్లకు దూరభారం!

స్టూడెంట్లకు దూరభారం!
  • ఆఫీసర్ల తీరుపై ఆరోపణలు
  • స్టూడెంట్స్, పేరెంట్స్ కు తప్పని ఇక్కట్లు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని ఎస్ఎన్​మూర్తి పాలిటెక్నిక్​కాలేజీ బిల్డింగ్​లో మూడు గురుకులాలు నడుస్తున్నాయి. తిరుమలాయపాలెం గిరిజన బాలుర గురుకులం, వైరా, రఘునాథపాలెం బీసీ బాలుర గురుకుల స్కూళ్లను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ మూడింటిలో కలిపి 1,100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రూమ్స్ సరిపోక స్టూడెంట్లు పడుకునే గదుల్లోనే క్లాసులు నడిపిస్తున్నారు. తిరుమలాయపాలెం ట్రైబల్ గురుకులం, వైరా బీసీ గురుకులాన్ని ఇక్కడి నుంచి ఆయా మండలాలకు తరలిస్తే, రఘునాథపాలెం బీసీ గురుకులానికి ఇప్పుడున్న కిరాయి బిల్డింగ్ సరిపోతుంది. ఇదిలాఉంటే తిరుమలాయపాలెం గురుకులానికి సొంత బిల్డింగ్  నిర్మించినా ఇక్కడి నుంచి తరలించడంలో మాత్రం ఆఫీసర్లు ఆలస్యం చేస్తున్నారు.

స్టూడెంట్స్, పేరెంట్స్​కు తిప్పలు
ఆఫీసర్ల తీరుతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీ, గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్లు, పేరెంట్స్​తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురుకులం మంజూరైన నియోజకవర్గంలో కాకుండా వేరే ప్రాంతంలో నిర్వహిస్తుండడంతో పేరెంట్స్​ తమ పిల్లలను వెళ్లి చూడాలన్నా, స్టూడెంట్లు సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లాలన్నా దూరభారంగా మారింది. వేర్వేరు నియోజకవర్గాలకు చెందిన దాదాపు 10 గురుకులాలు, కేజీబీవీలు ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న మండలాల్లో నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, ఇల్లందు నియోజకవర్గాలకు చెందిన రెండు గురుకులాలు, కేజీబీవీలను కూడా ఖమ్మంలోనే నడిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల బిల్డింగులు ఉండడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మూతబడిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల భవనాలను అద్దెకు తీసుకొని వీటిని నడుపుతున్నారు. ఈ బిల్డింగులకు స్టూడెంట్ల సంఖ్యను బట్టి నెలకు రూ.లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు కిరాయి చెల్లిస్తున్నారు.

ఆఫీసర్లపై ఆరోపణలు
మూతబడిన విద్యాసంస్థల ఓనర్లతో కమీషన్లు తీసుకుంటున్న కొందరు ఆఫీసర్లు ఏళ్ల తరబడి అందులోనే స్కూళ్లను నిర్వహించేలా ప్లాన్​ చేస్తున్నారని స్టూడెంట్​యూనియన్​లీడర్లు ఆరోపిస్తున్నారు. ఒకే క్యాంపస్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న దగ్గర అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. రెండు విద్యాసంస్థల్లో పని చేయాల్సిన సిబ్బందిలో సగం మందితోనే క్లాసులు నిర్వహిస్తూ, మిగిలిన సగం మంది అన్ అఫీషియల్ గా సెలవులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. డ్యూటీలు చేస్తున్నట్లు సంతకాలు చేస్తూ, జీతాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. వంట మనుషులను పెట్టకుండా స్వీపర్లతోనే వంటలు చేయిస్తూ ఆ బిల్లులను కూడా నొక్కేస్తున్నారని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇక ఈ గురుకులాలకు సరుకులు సప్లై చేసే కాంట్రాక్టు ఎవరు దక్కించుకున్నా, ఓ మహిళా అధికారి భర్తే అనధికారికంగా కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారననే ఆరోపణలున్నాయి.

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి మంజూరైన బీసీ గురుకులాన్ని, అశ్వారావుపేటకు మంజూరైన బీసీ బాలికల గురుకులాన్ని ఖమ్మం డేర్  కాలేజీలో నడిపిస్తున్నారు. అశ్వారావుపేట గిరిజన బాలికల డిగ్రీ గురుకులాన్ని తనికెళ్లలో నిర్వహిస్తున్నారు. 
  •  ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తిలో శాంక్షన్ చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలె బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్​ను, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని శ్రీరామా ఇంజనీరింగ్ కాలేజీ బిల్డింగ్ లో నడుపుతున్నారు. 
  • ముదిగొండ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను ఖమ్మం బొమ్మ కాలేజీలో నిర్వహిస్తున్నారు. 
  • తిరుమలాయపాలెం గిరిజన బాలుర గురుకులాన్ని ఖమ్మం పక్కన ఉన్న రఘునాథపాలెంలో నడిపిస్తున్నారు.
  • అశ్వారావుపేట మహాత్మ జ్యోతిబా పూలే బాలికల గురుకులాన్ని ఖమ్మం రూరల్ మండలంలోని డేర్ కాలేజ్ లో నిర్వహిస్తున్నారు. కారేపల్లి గిరిజన బాలుర గురుకులాన్ని,కొణిజర్ల మండలం తనికెళ్లలో నిర్వహిస్తున్నారు.
  • వైరా బీసీ బాలుర గురుకులాన్ని, నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం బీసీ బాలికల గురుకులాన్ని రఘునాథపాలెంలో నడిపిస్తున్నారు.
  • తిరుమలాయపాలెం సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాన్ని ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. 

కమీషన్ల కక్కుర్తే కారణం
గురుకులాలు, కేజీబీవీల్లో అవినీతి జరుగుతోంది. మూతబడిన ఇంజినీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్​ కాలేజీల బిల్డింగ్ ల ఓనర్లతో కమీషన్లు మాట్లాడుకొని విద్యా సంస్థలను కంటిన్యూ చేస్తున్నారు. రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఉన్నతాధికారులు విద్యా సంస్థలు స్టూడెంట్లకు అందుబాటులో ఉండేలా చూడాలి. ః

  - నామాల ఆజాద్​, పీడీఎస్​యూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ