
న్యూఢిల్లీ: భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. వాయుసేన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లాను గగన్ యాన్ కు వ్యోమగాములుగా ఎంపిక చేసింది. వీరిని గత నెల ప్రధాని మోదీ స్వయంగా పరిచయం చేశారు. కేరళలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో లైట్, డార్క్ బ్లూ రంగులతో కలగలిసిన వెరైటీ యూనిఫాంలో ఉన్న నలుగురు వ్యోమగాములతో మోదీ కరచాలనం చేశారు.
అయితే, వారు వేసుకున్న యూనిఫాం డిజైన్ వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ఆ వ్యోమగాముల్లో స్ఫూర్తినింపేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్(నిఫ్ట్) బృందం ఈ యూనిఫాంను రూపొందించింది. ఈ డిజైన్ ప్రత్యేకతలను నిఫ్ట్ ఫ్యాషన్ టెక్నాలజిస్ట్ డాక్టర్ మోహన్ వీకే వెల్లడించారు.
అసమానంగా డార్క్, బ్లూ కలర్స్..
గగన్‌యాన్‌లో నింగిలోకి వెళ్లబోయే నలుగురు వ్యోమగాముల కోసం లైట్, డార్క్ బ్లూ రంగులు అసిమ్మెట్రిక్ (అసమాన)గా ఉండేలా ఇస్రో యూనిఫాం సిద్ధం చేయించింది. దీన్ని నిఫ్ట్ బృందం ఎంతో కష్టపడి రూపొందించింది. ఈ యూనిఫాం తయారీకి ఇండియా కాటన్‌ను ఉపయోగించారు. ఆకాశాన్ని, శాంతిని ప్రతిబింబించేలా యూత్‌ఫుల్‌గా కనిపించేలా నీలిరంగుతో అసిమ్మెట్రిక్ విధానంలో ఈ డిజైన్‌ను రూపొందించారు.
ప్రత్యేకతలివే..
- మొత్తం 150 డిజైన్ల నుంచి నిఫ్ట్ 70 రకాల యూనిఫాంలను ఇస్రో ముందుంచగా, ఈ అసిమ్మెట్రిక్ డిజైన్‌ను ఎంపిక చేసింది.
- డార్క్, లైట్ బ్లూ కలర్‌తోపాటు హారిజాంటల్స్ట్రిప్స్తో అందంగా ఈ డిజైన్‌ను రూపొందించారు.
- వ్యోమగాములు ధరించిన గ్రౌండ్ యూనిఫాంను రష్యా నుంచి తెప్పించారు.
- అసిమ్మెట్రిక్ యూనిఫాంలోని నీలిరంగు శాంతి, సహనం, పట్టుదలను సూచిస్తుంది.
- యూనిఫాంపై వింగ్స్ బ్యాడ్జితోపాటు అశోకచక్ర, ఇస్రో లోగోను ముద్రించారు. బ్యాడ్జిపై ఉన్న రెక్కలు నింగిలో సోలార్ ప్యానెళ్లు తెరుచుకోవడాన్ని సూచిస్తాయి. ఇవి వ్యోమగాముల్లో సానుకూల దృక్పథాన్ని, పట్టుదల, ధైర్యాన్ని కలిగిస్తాయి. ఇవి వాయుసేనకు గుర్తుగా కూడా ఉంటాయి.
- అశోకచక్ర, ఇస్రో లోగో నింగిలోకి మనం గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా మన శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.