ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది : ఆర్​బీఐ గవర్నర్​

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది  : ఆర్​బీఐ గవర్నర్​

వీటిని నిషేధించాల్సిందే హెచ్చరించిన ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ 

ముంబై: బిట్​కాయిన్​ వంటి క్రిప్టోకరెన్సీలను ఎదగనిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత  దాస్​ హెచ్చరించారు. ఇలాంటి ప్రైవేటు కరెన్సీలను  నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆర్​బీఐ గతంలోనూ క్రిప్టోకరెన్సీలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ​కూడా ఇచ్చింది. ఇవి ఆర్థిక స్థిరత్వానికి, స్థూల ఆర్థిక వ్యవస్థకు హానికరమని చాలా కాలంగా చెబుతున్నామని దాస్​ అన్నారు. బిజినెస్​ స్టాండర్డ్​ వార్తాసంస్థ ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్​ చేశారు. ‘‘ అమెరికా చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా పేర్కొనే క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఎఫ్​టీఎక్స్​ తాజా క్రాష్‌‌‌‌‌‌‌‌ ఇందుకు ఉదాహరణ. ఇలాంటి మోసాలు చాలా జరిగాయి. వీటన్నింటి తర్వాత కూడా క్రిప్టోల గురించి మనం ఇంకేమీ చెప్పనవసరం లేదు.  ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వాల్యుయేషన్  190 బిలియన్ల డాలర్ల నుంచి   140 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయింది . మార్కెట్​ నిర్ధారించిన ధర దీనికి లేదు. ఇది 100 శాతం ఊహాజనిత వ్యాపారం.  దీనిని నిషేధించాలని  ఇప్పటికీ నేను కోరుకుంటున్నాను.  దీనిని పెంచడానికి అనుమతిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నుంచే వస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. క్రిప్టోలపై వివిధ సంస్థలు భిన్నమైన వైఖరిని తీసుకుంటున్నాయని, అయితే వాటిని పూర్తిగా నిషేధించాలనే  వైఖరికి ఆర్‌‌‌‌బీఐ కట్టుబడి ఉండాలని కామెంట్​ చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు ప్రభుత్వ రెగ్యులేషన్స్‌‌ను ఫాలో కావని,  ఫలితంగా వ్యవస్థను "విచ్ఛిన్నం" చేస్తాయని దాస్ చెప్పారు. క్రిప్టోల వల్ల జనానికి ఎటువంటి ఉపయోగమూ లేదని శక్తికాంత దాస్​ స్పష్టం చేశారు. 

మెస్సీ హిస్టరీ చదివాడా ?

హిస్టరీ చదివిన ఐఏఎస్​ ఆఫీసర్​ ఆర్​బీఐ బ్యాంకు గవర్నర్​ కావడమేంటన్న విమర్శకు ఇదే సందర్భంగా దాస్​ సమాధానం ఇచ్చారు. ఇటీవలి ఫిఫా వరల్డ్​ ఫైనల్ ​మ్యాచ్​లో అద్భుతంగా ఆడిన అర్జెంటీనా ఫుట్‌‌‌‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ కూడా చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేటా ? అని ప్రశ్నించారు.  ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చేసిన బ్యూరోక్రాట్ అయిన దాస్ 2018లో ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా నిష్క్రమించడంతో ఆర్​బీఐ గవర్నర్‌‌‌‌గా నియమితులయ్యారు. 28 సంవత్సరాలలో  మొదటిసారిగా ఆర్థికవేత్త కాని గవర్నర్ ఈయనే కావడం విశేషం. దాస్ ఇటీవలే గవర్నర్​గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేశారు. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా దాడి తరువాత కోవిడ్ మహమ్మారి, ఇన్​ఫ్లేషన్​ వంటి సంక్షోభాలను ఎదుర్కొన్నారు. ఆయన నియామకం గురించి చాలా మంది విమర్శకులు, ముఖ్యంగా సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. హిస్టరీ గ్రాడ్యుయేట్​ను ఆర్​బీఐ బాస్​గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం దాస్​ను సమర్థించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన ఎన్నో విజయాలు సాధించారని చెప్పారు.   

క్రెడిట్ గ్రోత్ అద్భుతంగా ఏమీ లేదు..

ప్రస్తుత  క్రెడిట్ గ్రోత్ అద్భుతంగా ఏమీ లేదని, అన్ని సంఖ్యలను పరిశీలిస్తే క్రెడిట్ గ్రోత్‌,​  డిపాజిట్ అక్రెషన్ మధ్య "పెద్ద తేడా" ఏమీ  లేదని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా చెప్పారు.  ప్రస్తుత సమయంలో క్రెడిట్ గ్రోత్ నిలకడగానే ఉందని అన్నారు.​  దీనిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. క్రెడిట్ గ్రోత్​తో  డిపాజిట్ వృద్ధిని పోల్చి చూసినప్పుడు, బేస్ ఎఫెక్ట్స్ కారణంగా రెండింటి మధ్య చాలా అంతరం కనిపిస్తోందని అన్నారు. రెండు సంవత్సరాల పాటు నెమ్మదించినా, ఇప్పుడు క్రెడిట్ గ్రోత్​ పెరుగుతోందని చెప్పారు. డిపాజిట్ల వృద్ధి బాగానే ఉందని అన్నారు. "గత సంవత్సరాలలో బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్నందున క్రెడిట్ గ్రోత్​ చాలా ఎక్కువగా కనిపించినట్లే, మునుపటి సంవత్సరాల బేస్ ఎఫెక్ట్స్ కారణంగా డిపాజిట్ వృద్ధి కూడా చాలా తక్కువగా ఉంది" అని ఆయన చెప్పారు. డిసెంబరు 2తో ముగిసిన 15  రోజులలో సిస్టమ్ 17.5 శాతం క్రెడిట్ గ్రోత్​ని నివేదించగా, డిపాజిట్ వృద్ధి 9.9 శాతం మాత్రమే ఉంది.  డిసెంబరు 2 వరకు సంవత్సరానికి క్రెడిట్ విస్తరణ రూ. 19 లక్షల కోట్లు కాగా, డిపాజిట్ గ్రోత్​ రూ. 17.5 లక్షల కోట్లు.  పొదుపరులకు బ్యాంకింగ్ వ్యవస్థలో అన్యాయం జరుగుతుందనే విమర్శకు దాస్ సమాధానమిస్తూ,  డిపాజిట్ రేట్లు ఇప్పటికే పెరుగుతున్నాయని, అవి మరింత పెరుగుతాయని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. లోన్​ రేట్లు 1.17 శాతం పెరగ్గా,  డిపాజిట్ రేట్లు 1.50 శాతం పెరిగాయని ఆయన చెప్పారు.