సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది

సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది
  • ములుగు, కొత్తగూడెంలోనే అధికం
  • డెంగీ కేసులు పెరిగే చాన్స్​
  • మంకీపాక్స్​పై గాంధీలో టెస్టులు

హైదరాబాద్, వెలుగు: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నాయని హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు అన్నారు. వర్షాలు పడి, తగ్గిన తర్వాత సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. డెంగ్యూ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి హరీశ్​రావు సోమవారం బీఆర్కే భవన్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్​రావు, కొప్పుల ఈశ్వర్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల కింద డెంగీ విజృంభించిందని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంకీ పాక్స్​ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తే ఫీవర్ హాస్పిటల్​కు తరలించినట్లు చెప్పారు. శాంపిల్స్​ సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్‌‌కు టెస్టులకు పంపామని, గాంధీ హాస్పిటల్​లోనూ నిర్ధారణ టెస్టులు చేస్తున్నామని తెలిపారు.

అన్ని జిల్లాల్లో అందుబాటులో కిట్స్​

సీజనల్​ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచినట్లు హరీశ్​రావు తెలిపారు. మంచి నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉన్నా.. డెంగీ వ్యాప్తి చెందుతుందన్నారు. హైదరాబాద్ లో ఎక్కువగా డెంగీ కేసులు నమోదయ్యే చాన్స్​ ఉందన్నారు. అందుకే ఫ్యామిలీ వెల్ఫేర్​ కమిషనర్ శ్వేతా మహంతిని అంటు వ్యాధులకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ గా నియమించినట్లు తెలిపారు. 

దోమల నివారణకు చర్యలు తీసుకోవాలె

సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తగిన చర్యలు చేపట్టాలని సీడీఎంఏ డైరెక్టర్​ సత్యనారాయణ సర్క్యులర్​ జారీ చేశారు. దోమలతోనే డెంగ్యూ, మలేరియా, చికెన్​ గున్యా వస్తున్నందున.. ఎక్కడిక్కడ వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 వారాల పాటు ప్రతి శుక్రవారం, ఆదివారం  ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

మంకీ పాక్స్​ లక్షణాలుంటే ఫీవర్​ హాస్పిటల్​లో​ ట్రీట్​మెంట్​

మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఫీవర్​ హాస్పిటల్​కు వెళ్లాలని మంత్రి హరీశ్​ సూచించారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్​పోర్టుల్లోనే పరీక్షలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. గవర్నమెంట్​ స్కూల్స్, హాస్టల్స్​లో మిడ్​ డే మీల్స్​ క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఆహారాన్ని తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్లు వెళ్లి విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించాలని ఆదేశించామని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.  బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరదలతో దెబ్బతిన్న ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్​రోడ్లకు రూ.10 కోట్లు చొప్పున రిలీజ్​ చేసినట్లు చెప్పారు.